నల్లగొండ, మే 08 : దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి అన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో మతాల మధ్య విద్వేషపూరిత వాతావరణం రెచ్చగొట్టేలా, ఇతర మతాల మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెట్టకూడదని తెలిపారు. గురువారం నల్లగొండ పట్టణ పరిధిలోని వన్ టౌన్, టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో పీస్ కమిటీ సభ్యులతో డీఎస్పీ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
సోషల్ మీడియాపై పోలీసుల నిఘా ఉంటుందని, అనవసర పోస్టులు పెట్టి కేసులపాలు కావొద్దన్నారు. మతాల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండేలా చూసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. అదేవిధంగా, పట్టణ పరిధిలో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు శంకర్, సైదులు, టూ టౌన్ ఎస్ఐ సైదులు, పీస్ కమిటీ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, ఖయ్యూం బేగ్, రియాజుద్దీన్ పాల్గొన్నారు.