నిడమనూరు, ఆగస్టు 26 : కేసుల దర్యాప్తులో అలసత్వం వహించవద్దని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ సిబ్బందికి సూచించారు. అలాగే సైబర్ క్రైం, డయల్ 100పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మంగళవారం నిడమనూరు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, రౌడీ షీటర్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పోలీస్ అధికారులు ఆయా గ్రామాలను ప్రతి రోజు సందర్శించి నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించి ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. గంజాయి, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, జూదం వంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. ఎస్పీ వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, హాలియా సీఐ సతీశ్ రెడ్డి, నిడమనూరు ఎస్ఐ సురేశ్ ఉన్నారు.