చండూరు, అక్టోబర్ 14 : చండూరు మండలం బోడంగిపర్తి గ్రామం నుండి చొల్లెడు గ్రామానికి వెళ్లే మార్గంలో బోడంగిపర్తి గ్రామంలోని మురుగునీరు కాల్వ తవ్వి రోడ్డుపై వదలడం వల్ల మురుగునీరు రోడ్డుపై పారి, బురదగా మారి గుంతలు ఏర్పడ్డాయి. చొల్లేడు గ్రామం నుండి బోడంగిపర్తి పాఠశాలకు ఆటోలు, సైకిళ్ల ద్వారా సుమారు వంద మంది విద్యార్థులు రోజూ రాకపోకలు సాగిస్తారు. అలాగే బోడంగిపర్తి రైతులు తమ పొలాలకు వెళ్లవలసి ఉంటుంది. ఈ మురుగు నీరుతో గుంతలు ఏర్పడడం వల్ల రైతులు, విద్యార్థులు అలాగే చొల్లేడు గ్రామానికి వెళ్లే పాదాచారులు రాకపోకలు కొనసాగించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అందులో మోటార్ సైకిళ్లు ప్రమాదవశాత్తు జారి పడడం జరుగుతుంది.
నమస్తే తెలంగాణలో ఈ నెల 12న ప్రచురితమైన రహదారి ఇలా.. రాకపోకలు ఎలా ? శీర్షికకు స్పందించిన బోడంగిపర్తి బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్కూరి రామలింగయ్య వెంటనే సమస్యను చండూరు మండల బీజేపీ ఉపాధ్యక్షుడు వరికుప్పల యాదగిరి దృష్టికి తీసుకెళ్లాడు. తక్షణం స్పందించిన యాదగిరి సుమారు రూ.30 వేలు తన సొంత డబ్బులతో మంగళవారం రోడ్డుపై మట్టి పోయించి గుంతలు పూడ్చారు. ఈ చర్యపై అందరూ హర్షం వ్యక్తం చేస్తూ వరికుప్పల యాదగిరికి ధన్యవాదాలు తెలిపారు.
Chandur : బోడంగిపర్తిలో రహదారి గుంతలను పూడ్చిన దాత