చండూరు, అక్టోబర్ 13 : గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థల్లో “గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ” కార్యక్రమాన్ని గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వైస్ చైర్మన్ డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి సోమవారం గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీజీ విద్యాసంస్థల నుండి పది విగ్రహాలకు గాను రూ.15 వేలు అందించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి గాంధీజీ విగ్రహాల తయారీకి అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించనున్నట్లు చెప్పారు. ఈ విగ్రహాలన్నింటినీ హైదరాబాద్లో నిర్వహించే ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామన్నారు.
గతంలో మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, అవగాహన సదస్సులు, గాంధీజీ వేషధారణ కార్యక్రమం పేరిట గాంధీజీ నడక, నడవడిక వంటి విభిన్న కార్యక్రమాలు కూడా ఇదే ప్రాంతం నుండి ప్రారంభించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాధించినట్లు వెల్లడించారు. అదే స్ఫూర్తితో “గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ “కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా ప్రధాన కార్యదర్శి జి.వి.రావు, రాష్ట్ర నాయకులు పుచ్చకాయల వెంకటరెడ్డి, ట్రస్మా చండూరు, నార్కట్పల్లి మండలాధ్యక్షుడు గొట్టిపర్తి చంద్రశేఖర్, అశోక్, పల్లె శ్రీనివాస్ గౌడ్, శిరంశెట్టి శ్రీధర్ బాబు, సరికొండ వెంకన్న పాల్గొన్నారు.