త్రిపురారం, జూలై 14 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు నిత్యం రోగులకు అందుబాటులో ఉండాలని నల్లగొండ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పద్మ అన్నారు. సోమవారం త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి, త్రిపురారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని, మందుల కొరత లేకుండా జిల్లా కేంద్రం నుంచి తెప్పించుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాలు పరిశుభ్రంగా ఉంటేనే వచ్చిపోయే రోగులు పరిశుభ్రంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఆమె వెంట డాక్టర్లు మాలోతు సంజయ్, ప్రియాంక, స్టాఫ్ నర్సులు, నాగలక్షీ, హైమావతి, నళినికాంత్, గౌతమి, సూపర్వైజర్ కీరిబాయి ఉన్నారు.