యాదగిరిగుట్ట, మే 3 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని నమ్ముకుని గత 40 ఏళ్లుగా కొండపై ఉన్న దుకాణాలే ఆధారంగా బతుకుతున్నామని కొండపై ఉన్న వర్తక సంఘం అధ్యక్షుడు గడ్డమీది మాధవులు గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు కొండపై షాపులకు టెండర్ల పిలిచి తమ పొట్ట కొట్టవొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకే తమకు కొండపై ఉన్న షాపులు కేటాయించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కొద్దిరోజులు కొండపై ఉన్న షాపులకు టెండర్ల వేయాలని వస్తున్న ప్రచారాన్ని ఖండించారు.
యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపై ఉన్న 114 షాపులను రద్దు చేశారన్నారు. గతంలో కేసీఆర్ నిర్ణయం మేరకు కొండపై ఉన్న 10 షాపులు నిర్వహించుకుంటూ 114 షాపులను పంచుకుంటున్నామన్నారు. దేవవస్థానం ఆదేశించిన మేరకు రుసుము చెల్లించి వ్యాపారం చేసుకుంటున్నామన్నారు.
కొండపై నిర్వహించే 10 షాపులతోనే 114 షాపులుగా మార్చుకొని సుమారు 500 మంది నిరుద్యోగులు జీవిస్తున్నారన్నారు. ఇప్పటికిప్పుడు 400 మందిని రోడ్డున పడేసి టెండర్ నిర్వహిస్తే కార్పొరేట్ వ్యక్తుల చేతికివెళ్లి ఇక్కడి యువతకు ఉపాధి లేకుండా పోతుందన్నారు. కార్యక్రమంలో కొండపై వర్తక సంఘం సభ్యులు తడక వెంకటేశ్ పాల్గొన్నారు.