– అర్వపల్లి ఎస్ఐ మధు నాయుడు
అర్వపల్లి, జూలై 07 : అర్వపల్లి మండల కేంద్రంలోని వై జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దని ఎస్ఐ మధు నాయుడు అన్నారు. మంగళవారం రెండు జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలు, రోడ్డుకు అడ్డంగా ఉంచిన వస్తువులు, అక్రమంగా నిలిపిన వాహనాలను పోలీసులు తొలగించారు. అలాగే పండ్లు, పూల వ్యాపారులు, టిఫిన్ సెంటర్ నిర్వాహకులు, ఇతర వ్యాపారులు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అలాగే రహదారిని ఆక్రమించకుండా వ్యాపారాలు నిర్వహించడం, రోడ్డుపై వాహనాలు నిలిపివేయకుండా ఉండడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఇకపై ఎవరైనా ఈ విషయాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.