కట్టంగూర్, మే 16 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తాలు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని కురుమర్తి గ్రామ గోదాంలో ఏర్పాటు చేసిన ధాన్యం నిల్వ కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. రైతుల పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలిగిన వెంటనే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఆయన వెంట సివిల్ సప్లయ్ డీటీ రాచకొండ జ్యోతి, స్థానిక సర్పంచ్ దార సత్తెమ్మభిక్షం, మాజీ సర్పంచ్ బూరుగు శ్రీను, రెవిన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు, స్థానిక నాయకులు ఉన్నారు.