పీఏపల్లి, మే 26 : ధాన్యం కొనుగోలులో కట్టింగ్ పెట్టొదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వల్లబ్రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న దగాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మా ర్వో కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి కష్టాలు రాలేవన్నారు. ధాన్యం విక్రయించిన వెంటనే డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని గు ర్తు చేశా రు. నేడు కాంగ్రెస్ పాలనలో సకాలంలో యూరియా లభించడం లేదన్నారు.
ధాన్యం చేతికొచ్చిన తరువాత విక్రయించడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని వాపోయారు. అనంతరం 42 మంది బాధిత రైతుల బిల్ పేపర్లు, ట్రక్ షీట్లను జత చేసి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. కార్యాక్రమంలో పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి మహేందర్, సర్పంచ్లు అడెపు నాగేష్, రాయనబోయిన శ్రీను, కుండ్రెడ్డి రాశేఖర్, రామావత్ కిషన్, నాయకులు తోటకూరి పర్మేశ్, సుధాకర్, కర్నాటి రవి, జవహర్, నారాయణదాసు, వెంకన్న, పేర్లా నాగేంద్రబాబు,ఆర్వీటీ యాదగిరి, పల్లే సత్యనారాయణ, గిరి, నాగేశ్, మహిపాల్, రాము పాల్గొన్నారు.
రాజాపేట, మే 26 : మండలంలోని సింగారం, బొందుగుల గ్రామంలో మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండటంతో పాటు అధికారులు, మిల్లర్ల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ధాన్యం బస్తాలకు నిప్పంటించి ఆందోళన చేశారు. మండలంలోని సింగారం రైతులు రాజాపేట గోదాముకు తాళం వేసి ధాన్యం బస్తాలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. వర్షాలు పడే అవకాశం ఉండటంతో ధాన్యం తడిసి భారీ నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తూకం, లిఫ్టింగ్ పనులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు రైతులతో మాట్లాడి సమస్య పరిషారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.