– ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
– దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ, మే 09 : ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై శనివారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ రమణా రెడ్డి, రైస్ మిల్లర్స్, ట్రాన్స్పోర్టు, తాసీల్దార్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, రవాణా (లారీలు), గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తగినన్ని టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలన్నారు. రైతుల నుండి అధిక తూకం తూయకుండా, వెంటనే లారీలు పంపి ఎగుమతులు వేగవంతం చేయాలని కోరారు.
యాసంగి ధాన్యం కొనుగోలు సజావుగా సాగేలా చూడాలన్నారు. ప్రతి గింజను కొనుగోలు చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిట్టచివరి రైతు వరకూ న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పుడున్న 70 లారీలతో పాటు మరో 30 లారీలు అదనపుగా ఏర్పాటు చేయాలని సూచించారు. సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఎం సివిల్ సప్లయ్, పీఏసీఎస్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, కొండ్ర శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, రైస్ మిల్లర్ అసోసియేషన్, యువ నాయకులు శ్రీకాంత్ యాదవ్, సర్పంచ్ బాబు రామ్ నాయక్ పాల్గొన్నారు.