పక్కాగా లెక్కలు తేలాకే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు
వయో పరిమితి పెంపుతో అందరికీ అవకాశాలు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణతో తీపికబురు
జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు
ఊరూవాడ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసిన నిరుద్యోగులు
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు
నల్లగొండ ప్రతినిధి, మార్చి 9(నమస్తే తెలంగాణ);కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. గతంలోనే భారీగా ఉద్యోగాల భర్తీ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగ యువత ఆనందానికి అవధుల్లేక పోయింది. వయో పరిమితి పెంపు, 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతతోపాటు యూనివర్సిటీ విద్యార్థులు కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. కొత్త జోనల్ విధానంతో జోన్, మల్టీజోన్ పరిధిలో సింహభాగం కొలువులు స్థానికులకే దక్కనున్నాయి. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్ అసెంబ్లీ చాంబర్లో కలిసి ఉమ్మడి జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
నీళ్ల కోసం తండ్లాడిన తెలంగాణ నేడు కృష్ణా, గోదావరి జలాలతో పచ్చబడ్డది. ఒక్క రూపాయి కూడా ఇవ్వం.. ఏం చేసుకుంటారో చేసుకోండన్న నాటి సమైక్య పాలకుల అహంకారానికి దీటైన బదులు చెప్తూ నిధుల వరదతో ప్రగతి పరవళ్లు తొక్కుతున్నది. నియ్యత్ గల సర్కారు పాలనలో ఇప్పుడు నియామకాల వంతొచ్చింది.ఉద్యోగాల భర్తీపై నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వనపర్తి సభలో ‘రేపు ఉదయం 10గంటలకు టీవీలు చూడండి’ అంటూ సీఎం కేసీఆర్ చెప్పడంతో యువత టీవీలకు అతుక్కుపోయింది. చెప్పిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా 80,039 ఉద్యోగాల భర్తీతో పాటు 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయనున్నట్లు ప్రకటించడంతో సంబురాలు అంబురాన్నంటాయి. యువతతో పాటు యూనివర్సిటీ విద్యార్థులు, కోచింగ్ సెంటర్లల్లోని అభ్యర్థులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సీఏం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు జరిపించి స్వీట్లు పంచిపెట్టారు. జై కేసీఆర్… జై తెలంగాణ అంటూ నినదించారు.
మల్టీజోన్‌లో 6,370 పోస్టులు
రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రితో పాటు చార్మినార్, జోగులాంబ జోన్లను కలిపి చార్మినార్ మల్టీజోన్‌ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా చార్మినార్ మల్టీజోన్ పరిధిలోకి వస్తుంది. ఈ మల్టీజోన్ పరిధిలో మొత్తం 6,370 పోస్టులను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇవి ప్రధానంగా గ్రూప్-1, గ్రూప్-2 ద్వారానే భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు ఉమ్మడి నల్లగొండతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అభ్యర్థులు పోటీ పడనున్నారు. వీరికే స్థానిక రిజర్వేషన్ల ప్రకారం మొత్తం పోస్టుల్లో 95శాతం దక్కనున్నాయి. మిగతా ఐదు శాతం పోస్టులకు మరో మల్టీజోనల్ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. మొత్తంగా స్థానికులకే ఉద్యోగాలు అన్న నినాదం నూతన జోనల్ విధానంలో కచ్చితంగా అమలుకానుంది.
జిల్లా స్థాయి పోస్టులు..
కొత్త జోనల్ విధానం వచ్చాక కొత్త జిల్లాల వారీగా జిల్లా స్థాయి పోస్టులను లెక్క తేల్చారు. ఇటీవల ఉద్యోగుల సర్ధుబాటు అనంతరం ఆయా జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ఆయా విభాగాల నుంచి సేకరించారు. ఆ ప్రకారమే నల్లగొండ జిల్లాలో జిల్లా స్థాయి పోస్టులు 1,398, సూర్యాపేట జిల్లాలో 719, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,010 పోస్టులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆయా విభాగాల్లో పాలనకు అనుగుణంగా ఖాళీలను నిగ్గు తేల్చారు. అనంతరమే అవసరమై ఖాళీలతో నోటిఫికేషన్లకు రంగం సిద్ధం చేస్తున్నారు.
యాదాద్రి జోన్లో 2,160
నూతన జోనల్ విధానంలో యాదాద్రి జోన్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలతో పాటు జనగాం జిల్లాను కూడా చేర్చారు. జోనల్ స్థాయి పోస్టులను ఇదివరకే ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆ ప్రకారమే యాదాద్రి జోన్ పరిధిలో మొత్తం 2,160 పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రభుత్వం ఏడున్నరేండ్లలో లక్షా 34 వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. మళ్లీ అసెంబ్లీ సాక్షిగా 80వేల 39 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఉద్యోగ నియామకాల్లో సుమారు 30 వేల ఉద్యోగాలు మహిళలకే దక్కేఅవకాశాలున్నాయి. నిరుద్యోగులకు వయోపరిమితి మరో 10 ఏండ్లు పొడిగించి వెసులుబాటు కల్పించడం సంతోషకరం. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కింది. నూతన జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి.- బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ, టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు
ఉద్యోగ నోటిఫికేషన్ చారిత్రాత్మకం
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలు ప్రకటించడం చరిత్రాత్మకం. ఉద్యోగాల భర్తీ ప్రకటన రాష్ట్ర ఏర్పాటుకు మూలమైన నియామకాల ఎజెండా అంశంలో తొలిమెట్టుగా భావించాలి. సీఎం కేసీఆర్ ముందు చూపు, కార్యాచరణతోనే అసాధ్యాలు సుసాధ్యమయ్యాయి. నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాతో తెలంగాణను సాధించిన సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్‌లో మన వాటాను సాధించడంతో ఆయకట్టు సస్యశ్యామలంగా మారింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాగు నీటి లభ్యత పుష్కలంగా దర్శనమిస్తున్నది. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితి పెంపు హర్షణీయం. ప్రజలు, నిరుద్యోగుల పక్షాన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ
ప్రతి పక్షాలకు చెంపపెట్టు..
సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన మెగా ఉద్యోగ నోటిఫికేషన్‌తో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తుండగా ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మారింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్ ఎన్నడూ రాలేదు. దీనిని జీర్ణించుకోలేని ప్రతిపక్ష నేతలు విచక్షణారహితంగా మాట్లాడుతున్నారు. నిరుద్యోగులను దారి మళ్లించే కుట్రలు పన్నుతున్నారు. రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
– ఐతగోని వెంకన్నగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, శాలిగౌరారం
వయో పరిమితి పెంపుపై హర్షాతిరేకాలు
స్వరాష్ట్రం కోసం కొట్లాడిన యువతకు ఉద్యోగాల్లో తగిన న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ఏర్పాటై ఏడున్నరేండ్లు కావస్తుండగా ఉద్యోగాల భర్తీలో పదేండ్ల సడలింపును ప్రకటించింది. దాంతో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరికీ అవకాశం కలుగనుంది. జనరల్ అభ్యర్థుల వయో పరిమితి 44సంవత్సరాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 49, దివ్యాంగులకు 54, ఎక్స్ సర్వీస్మెన్లకు 47 ఏండ్ల వరకు సడలింపు కల్పించారు. ఏ ఒక్కరూ నిరాశ చెందకుండా అందరూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా విశాల దృక్పథాన్ని ప్రభుత్వం ప్రదర్శించింది. సీఎం కేసీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటారన్న ప్రసంశలు వ్యక్తమయ్యాయి. ఇక ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ను కూడా ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగాల భర్తీపై కొందరు కుట్రపూరితంగా చేస్తున్న ఆరోపణలకు సీఎం కేసీఆర్ చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారన్న చర్చ సర్వత్రా సాగుతున్నది.
ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది..
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. గత శాసన సభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం 10 వేల మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం శుభ పరిణామం. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది.
– కట్టెబోయిన సైదులు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, హాలియా
కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆనందం
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు. జూన్ 2, 2014 రాష్ట్రం వచ్చే నాటికి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించగానే కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఓపికగా కేసులను ఎదుర్కొంటూ ముందుకు సాగింది. చివరగా గతేడాది డిసెంబర్ ఏడున కోర్టు అనుకూలం నిర్ణయం ప్రకటించడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సీఎం పచ్చజెండా ఊపారు. ఉమ్మడి జిల్లాలో వీరి సంఖ్య 700 వరకు ఉండవచ్చని అంచనా.