నల్లగొండ రూరల్, జనవరి 25 : కొలతలు, తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పి.రామకృష్ణ హెచ్చరించారు. నల్లగొండ పట్టణంలోని శివం, డాల్ఫిన్, సాయి కేక్స్ అండ్ బేక్స్లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రెడ్ ప్యాకెట్లపై తయారైన అడ్రస్, నిల్వ ఉండాల్సిన తేదీ, కస్టమర్ కేర్ చిరునామా, ఫోన్ నెబర్, ఇతర వివరాలు లేకపోవడాన్ని గుర్తించారు.
సాయి కేక్స్ బేక్స్, డాల్ఫిన్ బేకరీల్లో కిలో కేక్‌కు 150 గ్రాములు తక్కువ ఉన్నట్లు గుర్తించి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ బేకరీల నిర్వాహకులు సరైన తూకం పాటించాలని, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను విధిగా డిపార్టుమెంట్ వారితో వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.