నల్లగొండ, ఏప్రిల్ 25 : సీఎం కేసీఆర్ దార్శనికత, విజన్ వల్లే రాష్ట్రం ఈ తొమ్మిదేండ్లలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతి సాధించిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం నల్లగొండలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన లక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ దేశంలో గత యాసంగిలో 96 లక్షల ఎకరాల్లో వరి సాగైతే అందులో రాష్ట్రంలోనే 56 లక్షల ఎకరాల్లో సాగైందని పేర్కొన్నారు. దేశంలో 3.40 లక్షల తలసరి ఆదాయం సాధించిన రాష్ట్రం ఒక్క తెలంగాణేనని, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో తలసరి ఆదాయం ఎందుకు పెరుగడం లేదని ప్రశ్నించారు. బీజేపీ దద్దమ్మలు అభివృద్ధి గురించి పట్టించుకోకుండా మత విద్వేశాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని, ప్రజలు దీన్ని గుర్తించాలని సూచించారు.
ప్రజలకు ఉచితాలు ఇవ్వవద్దనే బీజీపీ సన్నాసులు అదానీ లాంటి వాడికి 12 లక్షల కోట్లు ఎలా ఇచ్చి బ్యాంకులను ముంచారని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బొర్ర సుధాకర్, కొండూరు సత్యనారాయణ, కనగల్, తిప్పర్తి ఎంపీపీలు కరీం పాషా, విజయలక్ష్మి, మండలాధ్యక్షులు దేప వెంకట్‌రెడ్డి, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, ఐతగోని యాదయ్య, నాయకులు రావుల శ్రీనివాస్‌రెడ్డి, నిరంజన్ వలీ, గోలి అమరేందర్‌రెడ్డి, జి.వెంకటేశ్వర్లు, మాలె శరణ్యారెడ్డి, బకరం వెంకన్న, నాగరత్నం రాజు, దుబ్బ రూప, జట్పీటీసీ చిట్ల వెంకటేశం పాల్గొన్నారు.
నాలుగేండ్లలోనే ఎంతో అభివృద్ధి : ఎమ్మెల్యే కంచర్ల
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ గత 20 ఏండ్లుగా నల్లగొండకు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి ఐటీ హబ్, మెడికల్ కళాశాల, మార్కెట్ యార్డు తెస్తానని, పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చి పబ్బం గడుపుకున్నాడే తప్ప చేసిందేమీ లేదన్నారు. తాను సీఎం కేసీఆర్ సహకారంతో నాలుగేండ్లలోనే పట్టణాలు, గ్రామాలను అన్ని రంగాల్లో అబివృద్ధి చేశానని తెలిపారు. పట్టణ ప్రజలు దీనిపై ఆలోచన చేసి మరోసారి బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.