యాదాద్రి భువనగిరి, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : ఎండిన చెరువులు.. వట్టిపోయిన బోర్లు, బావుల మధ్య నీటి వసతి లేక ఎండిన పంటలు పోగా.. మిగిలిన కొద్దిమొత్తాన్ని అయినా కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చేతికొచ్చే అరకొర ధాన్యమైనా సర్కారు సరిగ్గా కొంటుందా, లేదా? అన్నది సందేహంగా మారింది. గతేడాది మాదిరి రైతులను గాలికి వదిలేస్తే మరింత నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పదేండ్లపాటు సుభిక్షంగా ఉన్న జిల్లా రైతాంగానికి ప్రస్తుతం అరిగోస తప్పడం లేదు. జిల్లాలో ఎన్నడూలేని విధంగా 10 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దాంతో బోర్లు, బావులు సైతం వట్టిపోతున్నాయి. ఎండలు మండుతుండడంతో పొట్ట దశకు వచ్చిన వరి పైర్లు కండ్ల ముందే ఎండిపోతున్నాయి. జిల్లాలోని అనేక మండలాల్లో ఇప్పటికే వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అనేక చోట్ల రైతులు పొలాల్లో పశువులను మేపుతున్న దుస్థితి నెలకొంది. అక్కడక్కడా ఫర్వాలేదు అన్నట్టు ఉన్న పంటలకు మరో రెండు నెలలు కాపాడుకోవాల్సి ఉండగా, కొందరు రైతులు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోస్తున్నారు. ఇలా ఎన్నో తంటాలు పడుతూ పంటను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
సన్నాల సాగుకు రైతులు దూరం
యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లావ్యాప్తంగా 3.19 లక్షల ఎకరాల్లో సాగు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 2.98లక్షల ఎకరాల్లో వరి, మిగతా పంటలన్నీ కలిపి 21,320 ఎకరాలు సాగు చేసే అవకాశం ఉందని భావించింది. కాగా, 2.80లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. 8లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి మొత్తం దొడ్డు వడ్లేనని తెలుస్తున్నది. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈసారి జిల్లాలో రైతులు సన్నాలు సాగు చేయలేదు. గత సీజన్లో సన్న ధాన్యం వేస్తే 500 బోనస్ వస్తుందని కొంతమంది రైతులు సాగు చేసి సర్కారుకు అప్పగించారు. అందుకు సంబంధించిన బోనస్ డబ్బులు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సన్న వడ్లు సాగు చేయడానికి ముందుకు రాలేదు. ఇక దిగుబడిలోనూ ప్రభుత్వం 4.5లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మిల్లులు, ప్రైవేట్‌లో అమ్మకాలు, సొంత అవసరాలకు 3.5లక్షల మెట్రిక్ టన్నులు పోగా, మిగతాది కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 51 మిల్లులు ఉండగా, 10 రా, 41 బాయిల్డ్ మిల్లులు ఉన్నాయి.
1.12 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం
జిల్లాలో మరికొద్ది రోజుల్లో కోతలు షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మొత్తం 372 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటిల్లో ఐకేపీ, పీఏసీఎస్‌లు, ఇతర కేంద్రాలు ఉంటాయి. ఇప్పటికే సిబ్బందికి ఒక దఫా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. త్వరలో మరోసారి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ధాన్యానికి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దకాలంటే పలు సూచనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,320, కామన్ గ్రేడ్ రకానికి రూ.2,300 మద్దతు ధర కల్పించనున్నారు. జిల్లాలో మొత్తం 1.12 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కానున్నాయి. ప్రస్తుతం 80లక్షల బ్యాగులు అందుబాటులో ఉండగా, మిగతా వాటికి ఇండెంట్ పెట్టారు. జిల్లాలో 4వేల టార్ఫాలిన్లు ఉండగా, 11 వేలకు ఇండెంట్ పెట్టారు. ఇవి త్వరలోనే జిల్లాకు చేరుతాయని అధికారులు చెప్తున్నారు. తూకం వేసే పరికరాలు, తేమ నిర్ధారించే మీటర్లు సిద్ధంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
గత యాసంగిలో అనేక సమస్యలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే 2024లో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. గతేడాది జిల్లాలో మాత్రం వడ్ల సేకరణలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలున్నాయి. లారీలు, హమాలీల కొరత, తడిసిన ధాన్యం తదితర కారణాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ధాన్యం కొనడంలో జాప్యం జరుగడంతో పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. రోడ్లపై ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి రాస్తారోకోలు చేశారు. కలెక్టరేట్ ఎదుట, జాతీయ రహదారులపై వడ్లు పోసి నిరసన తెలిపారు. చేసేది లేక ప్రైవేట్‌లో అగ్గువ ధరకు అమ్ముకుని నష్టాల పాలైన వారూ ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని అడ్డికి పావుశెరు లెక్క అప్పగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారైనా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.