ఎండాకాలమంతా సూర్యుడి భగభగలతో సతమతమైన ప్రజలు.. మృగశిర కార్తె రోజు(జూన్-8)న చేపలు తిని ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందుతారనేది నానుడి. అయితే, ఈసారి మృగశిర కార్తె జిల్లాలోని మత్స్యహారులకు బ్యాడ్‌న్యూస్ తీసుకొచ్చిందనే చెప్పాలి. గత పదేండ్లుగా చేపల సవ్వడితో చెరువులు కనువిందు చేయగా, ఈ ఏడాది మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిఏటా జిల్లాలోని చెరువుల్లో ఆరు కోట్ల చేప పిల్లలు పోయగా, వాటిని కాంగ్రెస్ సర్కార్ మూడు కోట్లకు తగ్గించింది.
దీనికితోడు మరింత కోత పెట్టి చెరువుల చైర్మన్లను మేనేజ్ చేసిన కాంట్రాక్టర్లు.. చేపల కొరతకు మరింత కారణమయ్యారు. అంతేకాకుండా ఈసారి ఆంధ్రా నుంచి చేపలు దిగుమతి చేసినందున దయ్యం చేపలు, ఇప్పటికే చెరువుల్లో ఉన్న పాంప్లెంట్లతో సీడ్ పెద్దగా ఎదగలేదని, ఫలితంగా ఈసారి మృగశిరకు మన చేపలు అందుబాటులో ఉండవని మత్స్యకారులు పేర్కొంటున్నారు. దశాబ్దకాలం తర్వాత మళ్లీ ఆంధ్రా చేపలతోనే మృగశిర పండుగ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.
గతంతో పోల్చితే పోసింది సగమే..
నల్లగొండ, జూన్ 4 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిఏటా నల్లగొండ జిల్లాలో 100 శాతం సబ్సిడీతో 6 కోట్ల చేపపిల్లలను 750 చెరువుల్లో విడుదల చేసింది. అయితే, 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది చేప పిల్లల సంఖ్యను 2.98 కోట్లకు తగ్గించింది. అందులోనూ 2.04 కోట్ల చేప పిల్లలు 80 నుంచి 100 ఎంఎం కాగా, 0.93 కోట్లు 35 నుంచి 40 ఎంఎం సైజ్ కలిగిన వాటిని 340 చెరువుల్లో పోశారు.
అయితే, ఈ పిల్లలు పోసే నాటికి చెరువుల్లో నీటి నిల్వలు సరిగా లేకపోవటంతోపాటు టెండర్ల కోసం పోటీపడ్డ కాంట్రాక్టర్లు ఆయా చెరువుల చైర్మన్లను మేనేజ్ చేసి 1.60 కోట్ల చేప పిల్లలు మాత్రమే పోశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈసారి ఆంధ్రా నుంచి చేపపిల్లలు తేవడంతో అనేక చెరువుల్లోకి దయ్యం చేపలు వచ్చాయని, ఇప్పటికే ఆయా చెరువుల్లో పాంప్లెంట్లు ఉండటంతో మరిన్ని చేపపిల్లలు అంతరించి ఉన్న పిల్లలు పెద్దగా ఎదగలేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు.
ఇక ఆంధ్రా చేపలే దిక్కు..
దశాబ్దకాలంపాటు గత ప్రభుత్వం సబ్సిడీపై చెరువుల్లో పోసిన చేపలే మృగశిర సమయంలో మత్స్యకారులు పట్టడంతో మత్స్యహారులు కొనుగోలు చేసి ఇష్టంగా తినేవారు. ఈసారి మాత్రం చెరువుల్లో చేపలు సరిపడా లేకపోవడంతో మళ్లీ ఆంధ్రా చేపలే దిక్కయ్యాయని మత్స్యకారులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిఏటా జిల్లాలో సుమారు రూ.75 కోట్ల మత్స్య సంపద చేతికి రావటంతో ఓ వైపు మత్స్యకారులు ఆదాయం ఆర్జించడంతోపాటు మత్స్యహారులు తమ స్వస్థలంలోని చేపలనే తినేవారు. స్థానికులకు కిలో చేపలు రూ.80 నుంచి రూ.100కే లభించగా, ఈసారి మాత్రం ఆంధ్రా నుంచి వచ్చే చేపలు కావడంతో కిలోకు రూ.250 వరకు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు.