హుజూర్నగర్,మార్చి 19 : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ సమీపంలోని ఫణిగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం (రామస్వామి గుట్ట) సమీపంలో పేదల లబ్ధిదారుల కోసం నిర్మించిన సింగిల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ఇప్పుడు వివాదాల నిలయంగా మారింది. రూ.కోట్ల వ్యయంతో ఇక్కడ నిర్మించిన 2,160 ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియలో పారదర్శకత లోపించింది. నిబంధనలు తుంగలో తొక్కి, అధికార పార్టీ కనుసన్నల్లోనే వ్యవహారం సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. మొదటి విడతలో భాగంగా 805 ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆర్భాటంగా కట్టిన ఇండ్లు ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాలకే పరిమితమవుతున్నాయి. ముఖ్యమంగా ఇండ్ల పంపిణీలో పారదర్శకత లోపించిందని, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే అధికార యంత్రాంగం నడుస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఆశలపై అధికార పార్టీ నేతలు నీళ్లు జల్లుతున్నారు.
కేవలం ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కాలేదన్న నెపంతో పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉగాది నాటికైనా గృహప్రవేశం చేస్తామన్న కోటి ఆశలతో ఉన్న నిరుపేదలకు మంత్రి ఉత్తమ్ తీరు మింగుడు పడడం లేదు. సీఎం పర్యటన ఖరారైతేనే కానీ పంపిణీ చేయకూడదన్న నిబంధన ఎక్కడుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకున్న అధికార పార్టీ నేతలు,ఇండ్ల పంపిణీని తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు అనుసరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. కావాలనే శనివారం వంటి సెలవు దినాన్ని ఎంచుకుని లబ్ధిదారుల డ్రాఫ్టు జాబితాను ప్రకటించడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
తమ అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం లేకుండా చేసి, దొడ్డిదారిన తమ వారికి ఇండ్లు కట్టబెట్టేందుకే ఈ డ్రామా ఆడారంటూ లబ్ధిదారులు సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 360 డిగ్రీల పరిశీలన అంటూ అధికారులు గొప్పలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం పారదర్శకత మచ్చుకైనా కనిపించడం లేదు. అర్హులైన నిరుపేదలను పక్కన పెట్టి,కాంగ్రెస్ పార్టీ నాయకుల అనుచరులకు, బంధువులకు చివరకు ఒకే ఇంట్లో ఉన్న భార్యభర్తలకు కూడా ఇండ్లు కేటాయించడం ఏ రకమైన పారదర్శకత అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి పదే పదే పర్యటిస్తున్నా అది కేవలం పరిశీలనకే పరిమితమవుతోంది తప్ప పంపిణీకి మోక్షం కలగడం లేదు. మొత్తం 2,160 ఇందిరమ్మ ఇండ్లలో మొదటి విడతగా 805 ఇండ్లను సిద్ధం చేశారు. అయితే మిగిలిన ఇండ్ల పంపిణీ ఎప్పుడనేది తెలియడంలేదు. అసలు ఈ 805 ఇండ్లలోనైనా నిజమైన పేదలకు చోటు దక్కుతుందా.. లేక రాజకీయ సిఫార్సులకే పెద్దపీట వేస్తారా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది.