మంత్రి ఉత్తమ్ సారూ.. కొంచెం టైమ్ ఇచ్చి మూడు చక్రాల స్కూటీలు పంపిణీ చేయరాదూ.. అని దివ్యాంగులు కోరుతున్నారు. దివ్యాంగుల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన మూడు చక్రాల స్కూటీలు కలెక్టరేట్ కారిడార్‌లో రెండు నెలలుగా మూలుగుతున్నాయి. పంపిణీకి ఏర్పాట్లు చేసినా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టైమ్ ఇవ్వకపోవడంతో రెండు సార్లు వాయిదా పడింది. దాంతో స్కీమ్‌లో ఎంపికైన 15 మంది దివ్యాంగులు మంత్రి ఎప్పుడొస్తారో.. స్కూటీలు ఎప్పుడిస్తారోనని ఎదురు చూస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఎంతో కృషి చేసింది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం దివ్యాంగ విద్యార్థులు, యువతకు మూడు చక్రాల స్కూటీలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకం కోసం జిల్లా వ్యాప్తంగా 140 మంది దరఖాస్తు చేసుకోగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. వారికోసం 15 స్కూటీలు మంజూరు చేసింది. కానీ.. శాసనసభ ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ ఆగిపోయింది. ఎన్నికల కోడ్ ముగిశాక ఇస్తామని అధికారులు చెప్పుకొంటూ వస్తున్నారు. ఇప్పుడు మంత్రి వస్తేనే పంపిణీ అంటున్నారు. దీంతో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు.
జిల్లాకు 15 స్కూటీలు మంజూరు కాగా, వాటిని టీవీఎస్ కంపెనీ నుంచి ఒక్కొక్కటి రూ.95 వేలు పెట్టి కొనుగోలు చేశారు. మొత్తం రూ.14.15 లక్షలు పెట్టి కొనుగోలు చేసి దాదాపు మూడు నెలలు అయ్యింది. అయినా కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పంపిణీ చేయడానికి ముందుకు రావడం లేదు.