నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : యాసంగికి రైతుబంధు రాక మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడికి నిధులు విడుదల చేయడంతో తొలిరోజు బుధ వారం ఎకరంలోపు ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ అయ్యింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.02లక్షల మందికి రూ.91.16 కోట్లు అందాయి. గురువారం రెండెకరాల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ పెట్టుబడిసాయం అందే వరకు ఇది నిరాటంకంగా కొనసాగనున్నది. పంటల సాగులో పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2018 వానకాలంలో రైతుబంధు పథకాన్ని ప్రారంభించి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో మందికి అప్పుల బాధ నుంచి ఊరట కలిగిస్తున్నది. వరుసగా పదో విడుత సాయం అందజేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు నగదు అందుకున్న రైతులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రైతుకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతుబంధు పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. బుధవారం నుంచే రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పది, పదిహేను రోజుల్లోనే అందరికీ డబ్బులు జమ చేసి పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ యాసంగిలో సుమారు 1300 కోట్ల రూపాయలను అందజేసేందుకు సిద్ధమైంది. తొలి రోజు ఎకరం లోపు రైతులందరి ఖాతాల్లోనూ నగదు జమ చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా రైతులకే రైతుబంధు డబ్బులు అందాయి. ఉదయం 9 గంటల నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నట్లుగా టింగ్ టింగ్ అంటూ మెసేజ్‌లు రావడం మొదలైంది. ఎకరం లోపు రైతులందరికీ మధ్యాహ్నానికే డబ్బులు జమయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి రోజు 1,82,330 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 3,02,459 మంది రైతులకు 91,16,49,652 రూపాయలు ఖాతాల్లో జమయ్యాయి.
ఇందులో ఒక్క నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 1,41,257 మంది రైతులకు 86,531 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 43.26 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందింది. ఇక సూర్యాపేట జిల్లాలో మొత్తం 86,092 మంది రైతుల ఖాతాల్లో 27.02 కోట్ల రూపాయలు జమయ్యాయి. 54,043 ఎకరాల భూములకు సంబంధించి తొలిరోజు కవర్ అయ్యాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 41,755 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 75,112 మంది రైతులకు 20.87 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం జమ చేసింది. పథకం ప్రారంభం నుంచి సీజన్ సీజన్‌కు ఉమ్మడి జిల్లా రైతాంగానికి రైతుబంధు ద్వారా అందుతున్న పెట్టుబడి సాయం అంతకంతకూ పెరిగిపోతూ వస్తున్నది.
ఈ యాసంగిలో గతంలో ఎన్నడూ లేనంతటి సాయం ఉమ్మడి జిల్లా రైతులకు అందనున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో మొత్తం సుమారు 25 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన 10.81 లక్షల మంది రైతులకు రూ.1300 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేడు రెండెకరాల్లోపు రైతులకు, తర్వాత రోజుల్లో వరుసగా మూడు, నాలుగు… ఇలా చివరి రైతు వరకు రైతుబంధు పథకం డబ్బులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. ఇలా దశలవారీగా మొత్తం పది నుంచి పదిహేను రోజుల్లోపే పట్టాదారు పాసు పుస్తకం ఉండి వివరాలు అందజేసిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సంతోషంలోరైతన్నలు..
ఎప్పటిలాగే సీజన్ ఆరంభంలో రైతుబంధు డబ్బులు వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల సంబరాలు కూడా జరుపుకొన్నారు. ఎకరాకు ఐదు వేల రూపాయలు ఇస్తుండడంతో సాగుకు అవసరమైన దాదాపు పెట్టుబడి సమకూరుతుందని రైతులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా షావుకార్లు, వడ్డీ వ్యాపారస్తుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. నేల స్వభావానికి అనుగుణంగా పంట వేయడంలోనూ, దాన్ని మార్కెట్లో గిట్టుబాటు ధరకు అమ్ముకోవడంలోనూ తమకే స్వేచ్ఛ లభించిందని సంబరపడుతున్నారు. గతంలో పెట్టుబడి ఇచ్చిన ప్రైవేట్ వ్యాపారులకే తమ పంటలు అమ్మాల్సి ఉండేదని, రైతుబంధు పథకం వచ్చిన నాటి నుంచి ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. స్వయంగా రైతు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అవసరాలకు తగ్గట్లు పథకాలు అమలు చేస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నారని రైతులు అభినందిస్తున్నారు. కేసీఆర్‌తోనే వ్యవసాయం లాభసాటిగా మారి తమ జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతుబంధు ఎప్పటికీ గుర్తుండిపోతుంది
నాకు మా గ్రామంలో 27 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని సాగు చేసుకుంటూ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాం. నాకున్న కొద్దిపాటి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాలంటే ఇబ్బందిపడాల్సి వచ్చేది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో ఎంతో మేలు జరుగుతున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. సీఎం కేసీఆర్ అందిస్తున్న ఈ సాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది.
-మునగ సైదులుయాదవ్, కొత్తపేట, కేతేపల్లి
రైతుల మేలు కోరే నాయకుడు కేసీఆర్ సార్
రైతుల మేలు కోరే నాయకుడు సీఎం కేసీఆర్. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇస్తున్నారు. దాంతో నేడు వ్యవసాయం పండుగలా మారింది. నా పేరున ఉన్న 6 గుంటల భూమికి 750 రూపాయలు నా బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. నాకు 3.6 ఎకరాల భూమి ఉండగా.. ముగ్గురు కొడుకులకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున గిఫ్ట్‌డీడ్ చేశా. వాళ్లకు కూడా నేడు డబ్బులు పడనున్నాయి. క్రమం తప్పకుండా ఏడాదికి రెండుసార్లు పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్ సారుకు మేమంతా రుణపడి ఉంటాం.
-ఉప్పల భిక్షమయ్య, చందనపల్లి, నల్లగొండ
పెట్టుబడి సాయం గొప్ప విషయం
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం మరువలేనిది. ప్రతి రైతు కండ్లల్లో ఆనందం చూడాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉక్కు సంకల్పానికి ఇంతకన్నా నిదర్శనం వేరే ఉండదు. రైతులకు అందుబాటులో అన్ని విధాలుగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. పంట పెట్టుబడికి రైతులకు ఆర్థిక సాయం అందజేయడం గొప్ప విషయం. ప్రతి రైతు ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అనడంలో అతిశయోక్తి లేదు. రైతులను ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. ఆయనకు రైతులంతా రుణపడి ఉండాలి.
– జూకంటి ఉప్పలయ్య, ఆలేరు రూరల్
పెట్టుబడి సాయం కూలీలకు ఉపయోగించా..
ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు డబ్బులను ఈసారి వరి నాటు వేసిన కూలీలకు అక్కరొచ్చినయి. పదో విడుత రైతుబంధు డబ్బులు జమైనట్లు ఉదయం పది గంటలకే నాకు మెసేజ్ వచ్చింది. పొలం దగ్గర ఉన్న నేను ఇంటికెళ్లి ఆ తర్వాత దేవరకొండకు పోయాను. ఆంధ్రా బ్యాంక్ ఖాతాలో జమైన రూ.5 వేలు డ్రా చేసుకొని వరినాటు వేసిన కూలీలకు ఇచ్చాను. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే రైతుబంధు డబ్బులు ఎంతో ఆసరా అవుతున్నాయి. రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌ను ఎన్నటికీ మర్చిపోం.
–నల్లగాసు వీరయ్య, వైదోనివంపు, దేవరకొండ
పండుగలా వ్యవసాయం..
సీఎం కేసీఆర్ భరోసాతోనే నాకున్న 30 గుంటల భూమిలో ఆనందంగా వ్యవసాయం చేస్తున్నా. రైతుల కష్టాలను గుర్తెరిగి దండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. గత ప్రభుత్వాల హయాంలో నీళ్లు లేక, పంటలు పండక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కొద్దిపాటి నీళ్లున్నా అప్పులు చేసి వ్యవసాయం చేస్తే వచ్చిన పైసలు మిత్తికి సరిపోయేవి కావు. కానీ, నేడు కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు, రైతుబంధు ద్వారా డబ్బులు, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నరు. ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులంతా రుణపడి ఉండాలి.
-యల్మకంటి సత్తయ్య, నాగారం, సూర్యాపేట
రైతుబాంధవుడు సీఎం కేసీఆర్
వ్యవసాయానికి పెట్టుబడి సమయంలో రైతుబంధుతో సీఎం కేసీఆర్ రైతులను దేవుడిలా ఆదుకుంటున్నారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు ఎకరానికి ఐదు వేల చొప్పున సకాలంలో డబ్బులు జమ చేస్తున్నారు. పదో విడుత డబ్బులు నా ఖాతాలో జమైనట్లు సెల్‌కు మెసేజ్ వచ్చింది. రైతు సంక్షేమం కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శప్రాయుడు. ఇలాంటి పథకాలు దేశ వ్యాప్తంగా రైతులందరికీ అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. మున్ముందు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారనే నమ్మకం ఉంది.
–పట్టా నాగరాజు, చిలుకూరు, కోదాడ రూరల్
రైతును రాజు చేస్తున్న సీఎం కేసీఆర్
నాకు ఆమనగల్లులో ఎకరం ముప్పై గుంటల పొలం ఉంది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో నాకు ఏడాదికి రూ.18వేలు నా బ్యాంక్ ఖాతాలో జమవుతున్నాయి. ఈ డబ్బుతోనే నేను వ్యవసాయ సాగుకు అవసరమయ్యే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నాను. సీఎం కేసీఆర్ అందచేసే రైతుబంధు సాయంతో పెట్టుబడి ఖర్చు తీరుతున్నది. రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. మన రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను చూసి దేశంలోని రైతులంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
– బంటు రామకృష్ణ, ఆమనగల్లు, వేములపల్లి
అప్పుల తిప్పలు తప్పినయ్
గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయ పెట్టుబడి కోసం ఆడవారి మెడలోని పుస్తెలతాడు కుదవబెట్టేవాళ్లం. ఆ డబ్బుతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి వ్యవసాయం చేసెటోళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ పెట్టుబడికి వడ్డీ తిప్పలు తప్పినయి. కేసీఆర్ సారు ఏడాదికి రెండుసార్లు పెట్టుబడి సాయం అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. సకాలంలో డబ్బులు అందుతుండడం సంతోషంగా ఉంది. నాడు దండుగ అన్న వ్యవసాయం.. నేడు పండుగలా మారింది. రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
–గాయం వెంకట్‌రెడ్డి, రైతు, మఠంపల్లి
పెట్టుబడికి అప్పుల తిప్పలు తప్పినయ్
గతంలో పొలం సాగు చేయాలంటే ఏ పని మొదలు పెట్టాలన్నా అప్పు చేస్తుంటిని. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయ్యాక అప్పుల తిప్పలు తప్పినయి. ఏటా రెండుసార్లు పెట్టుబడి సాయం ఇస్తుండటంతో ఇబ్బంది ఉంటలేదు. ఇయ్యాల్నే రైతుబంధు డబ్బులు పడ్డట్లు మెసేజ్ వచ్చింది. కేసీఆర్ సారు ఇస్తున్న డబ్బులు ఎంతో ఆసరా అవుతున్నయి. వాటితోనే పొలం దున్నడం, వరి నారు, ఎరువులు కొనడం చేస్తున్నా. సారు వచ్చినాకే పొలానికి నీళ్లు వస్తున్నయి. సాగుకు డబ్బులు ఇస్తుండు. పండిన పంట కొంటున్నడు. ఇంతకన్నా రైతుకు ఏం కావాలి.
–ధనావత్ గాంస్యా, కేజేఆర్కాలనీ, దామరచర్ల