కోదాడ, జూలై 18 : అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడలోని డేగ బాబు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌తో కలిసి హాజరై లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ. దేశంలో సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జిల్లాలో అర్హులైన పేదవారికి ఆహార భద్రత కల్పించి, ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
కోదాడ డివిజన్లోని 6 మండలాల్లోని కోదాడ, చిలుకూరు, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతేలో 174 చౌక దుకాణాల్లో సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను అందజేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ.. ప్రతి లబ్ధిదారుడు రేషన్ కార్డును భద్రపరచుకోవాలని, ప్రతి సంక్షేమ పథకానికి ఇది ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ డివిజన్ రెవెన్యూ అధికారి సూర్యనారాయణ, తాసీల్దార్ వాజిద్ అలీ, మోతె తాసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ శైలజ, డీటీ సూరయ్య, ఆర్ఐ రాజేశ్, జగదీష్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.