దామరచర్ల, జూలై 8 : రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు. మండలంలో 562 మంది గిరిజన కుటుంబాలకు 979 ఎకరాల పోడు భూములకు సంబంధించిన పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజన సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పోడు భూముల పట్టాల పంపిణీకి కేంద్రం, అటవీ శాఖ అనేక ఇబ్బందులు పెట్టాయని.. అన్నింటినీ అధిగమించి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో 4లక్షల గిరిజన కుటుంబాలకు 1.50లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు అందజేస్తున్నారని తెలిపారు.
హరితహారంతో రాష్ట్రంలో నేడు 7.7శాతానికి అడవులు పెరిగాయన్నారు. చెట్టు మనిషి జీవితంలో భాగస్వామ్యం కావాలని, వాటిని పిల్లలతో సమానంగా పెంచాలని సూచించారు. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. మిర్యాలగూడ డివిజన్లో 48తండాలను జీపీలుగా ఏర్పాటు చేయడంతోపాటు నూతన భవనాలను నిర్మించినట్లు చెప్పారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో సాగుకు అనుకూలమైన ప్రతి ఎకరాకు నీళ్లు అందించే లక్ష్యంతో నాగార్జున సాగర్ నుంచి హుజూర్నగర్ వరకు ఎత్తిపోతల పథకాలకు రూ.1900 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఒక విజన్‌తో, ముందస్తు ప్రణాళికతో పాలన సాగిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో సీఎం కుర్చీ కోసం అప్పుడే కుమ్ములాటలు, కొట్లాటలు మొదలయ్యాయని.. కాళ్లు, చేతులు కదల్లేని వృద్ధులు సైతం సీఎం కుర్చీ కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి వారికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ర్టానికి వచ్చి సీఎం కేసీఆర్‌ను తిట్టిపోవడమే తప్ప.. రాష్ట్రానికి ఇచ్చేదేమీ లేదని విమర్శించారు.
ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నారని, పోడు భూముల పట్టాల పంపిణీతో వారి కష్టాలు తొలగిపోయాయని అన్నారు. మిగిలిన వారికి కూడా పట్టాలను అందజేస్తామని చెప్పారు. పట్టాలతోపాటు రైతుబంధు, రైతు బీమా సదుపాయం కూడా కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి.నారాయణరెడ్డి, ఎంపీపీ డి.నందిని, జడ్పీటీసీ ఆంగోతు లలిత, తాసీల్దార్ గణేశ్, ఎంపీడీఓ జానయ్య, ఎంపీటీసీలు సోము సైదిరెడ్డి, బాల లక్ష్మి, ఎండీ యూసుఫ్, డి.వెంకటేశ్వర్లు, ఆంగోతు హాతీరాం, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కె.వీరకోటిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.