కోదాడ, ఆగస్టు 11 : సమైక్య పాలనలో కుల వృత్తిదారులు కనుమరుగయ్యారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రంలో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వారికి లక్ష సాయం అందిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడలోని ఓ ఫంక్షన్ హాల్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కులవృత్తిదారులు 294 మందికి రూ.2.94కోట్ల చెక్కులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం అమలు జరుగడం లేదని, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
కుల వృత్తిదారులు ఆర్థికంగా ఎదుగాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ చేయూత నందిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 300 మందికి లక్ష చొప్పున సాయం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే గొల్లకురుములు, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలు, చేతివృత్తుల వారి అభివృద్ధికి లక్ష సాయం అందించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. కాంగ్రెస్ హయాంలో సాగర్ ఎడమ కాల్వ కింద భూములు ఎండబెటితే, స్వరాష్ట్రంలో ఆయకట్టుకు వరుసగా 17 పంటలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్దే అని గుర్తుచేశారు. భవిష్యత్తులో సాగర్ ఎడమ కాల్వకు కాళేశ్వరం జలాలు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. కోదాడలో మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని పేర్కొన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం : ఎమ్మెల్యే బొల్లం
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ..రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. అందులో భాగంగానే కులవృత్తిదారుల ఆర్థిక పరిపుష్టికి లక్ష సాయం అందిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో 80 శాతం పైగా ఉన్న బడుగు, బలహీనవర్గాల జీవన స్థితుగతులు మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆరు దశాబ్దాల్లో గత పాలకులు చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర ఏండ్లలో చేసి చూపించారని పేర్కొన్నారు. ఆయకట్టు చివరి ప్రాంతమైన మోతె, నడిగూడెం, మునగాల మండలాలకు కాళేశ్వరం జలాలు రప్పించి సస్యశామలం చేస్తున్న అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. నియోజకవర్గంలో 1,950 కోట్లతో జరిగిన అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల ఫలితమేనని, ఆయనకు వెన్నుదన్నుగా ఉండి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించేందుకు శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ దీపికాయుగంధర్, ఎంపీపీలు, కవిత, చుండూరు వెంకటేశ్వర్రావు, ఎలక బిందు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ వనపర్తి శిరీష, వెంపటి పద్మ, రైతుబంధు నియోజకవర్గ కన్వీనర్ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, కొండా సైదయ్య, గింజుపల్లి రమేశ్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.