హాలియా, జూలై 11 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గిరిజన రైతులకు పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళవారం హాలియాలో సంబురంగా జరిగింది. ఎన్నో ఏండ్లుగా అటవీ భూమిని సేద్యం చేస్తూ హక్కు పత్రాల కోసం ఎదురు చూస్తున్న త్రిపురారం, పెద్దవూర, తిరుమలగిరి(సాగర్) మండలాల్లోని గిరిపుత్రులకు ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ చేతుల మీదుగా పోడు భూమి పట్టాలు అందజేయడంతో గిరిజనుల ఆనందానికి అవధుల్లేవు. నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 2వేల ఎకరాల అటవీ భూములను 1,026 మంది రైతులకు అందజేయడంతో గిరిజనుల్లో ఆనందం మిన్నంటింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గిరిజనుల పక్షపాతి అని, గిరిజన ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రతిరూపమే ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. గతంలో కాంగ్రెస్ పాలకులు గిరిజనులను ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకున్నారు తప్ప వారి అభ్యున్నతికి పాటుపడిన దాఖలాలు లేవన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచడంతోపాటు గిరిజన తండాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. జానారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగిన కాలంలో గిరిజనులకు ఏమీ చేయలేదని విమర్శించారు. జిల్లా హౌజింగ్ పీడీ రాజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మిర్యాలగూడ ఆర్డీఓ చెన్నయ్య, పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ, డీసీసీబీ డైరెక్టర్ ఇరిగినేని అంజయ్య, హాలియా, నిడమనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశ్వర్లు, మర్ల చంద్రారెడ్డి, గిరిజన సంఘం నాయకుడు బాబూరావునాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు కేతావత్ భిక్షానాయక్, పెద్దవూర పీఏసీఎస్ చైర్మన్ గుంటుక వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవినాయక్, పిడిగం నాగయ్య, కూరాకుల వెంకటేశ్వర్లు, నరేందర్, తాసీల్దార్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇనాం భూములకు పట్టాలు
తిరుమలగిరి(సాగర్) : మండలంలోని 72 మంది పేదలకు ఇనాం భూములను హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భగత్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్నాయక్తో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నయ్య, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, మార్కెట్ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, తాసీల్దార్ పాండునాయక్ పాల్గొన్నారు.
గిరిజనులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు
ట్రైకార్ చైర్మన్ రాంచందర్‌నాయక్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గిరిజనులు ఎప్పటికీ రుణపడి ఉంటారని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ అన్నారు. గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచడంతోపాటు గిరిజన తండాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను ఆదుకొన్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరబాద్‌లో 100 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని గిరిజన భవన్ కోసం ఇవ్వడంతోపాటు బంజారా హిల్స్‌లో సంత్ సేవాలాల్ భవనాన్ని నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని గిరిజనులు గుండెల్లో పెట్టుకున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటారని తెలిపారు.