మాల్, జూన్ 15 : నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని రోటిగడ్డ తండాలో భూమి గెట్టు పంచాయతీ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చింతపల్లి మండల పరిధిలోని రోటిగడ్డ తండాకు చెందిన నేనావత్ రవీందర్ నాయక్, వారి పాలివారైనా నేనావత్ రాజేందర్ నాయక్, నేనావత్ రవి నాయక్‌లకు తక్కలపల్లి గ్రామ సమీపంలో మూడు ఎకరాల భూమి ఉంది. గతంలో పంచుకొని ఎవరి భూమి వారు సాగు చేసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం వారికి ఉన్న భూమిలో గెట్టు పంచాయతీ విషయమై ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో మాట.. మాట పెరిగి కట్టెలతో కొట్టుకోవడంతో పాటు, ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు.
ఈ విషయ గ్రామస్తులకు తెలియగా వెంటనే సంఘటన స్థలానికి పలువురు గ్రామస్తులు చేరుకున్నారు. అప్పటికే నేనావత్ రవీందర్ నాయక్ కు తల, ఒంటిపై బలమైన గాయాలు కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయాపడ్డ రవీందర్ నాయకును చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేనావత్ రవీందర్ నాయక్‌ను కొట్టి చంపిన వ్యక్తులు పరారీలో ఉన్నారు. మృతుడి భార్య, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.