చివ్వెంల, ఏప్రిల్ 02 : త్వరలో జరుగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో దివ్యాంగులకు అవకాశం కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి రూ.3 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో సంఘం నేతలతో కలిసి మట్టి తింటూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దివ్యాంగ సమాజానికి అనేక హామీలు ఇచ్చి వారి ఓట్లు కొల్లగొట్టి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తన 15 నెలల పాలనా కాలంలో దివ్యాంగ సమాజానికి చేసింది శూన్యం అన్నారు.
పింఛన్లు రూ.6 వేలకు పెంచడంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, దివ్యాంగుల అట్రాసిటి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్కటి అమలుకు నోచుకోపోవడం బాధాకరం అన్నారు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు పోతురాజు సుధీర్, జిల్లా ఉపాధ్యక్షులు మున్న మధుయాదవ్, ఆవుల నరేందర్, చంద్రయ్య, సుక్కయ్య, వినోద్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.