త్రిపురారం, జూలై 15 : నేరుగా విత్తే పద్ధతి ద్వారా కూలీల కొరతను అదిగమించి లాభాలను గడించవచ్చని నల్లగొండ జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్ అన్నారు. మంగళవారం త్రిపురారం మండలంలోని కంపసాగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన స్థానంలో డ్రోన్ సహాయంతో నేరుగా వరి విత్తే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పరిశీలించారు. అలాగే యాంత్రిక పద్ధతిలో వెదజల్లే పద్ధతిని ఆయన పరిశీలించి మాట్లాడారు. కంపసాగర్‌లో గత రెండేండ్లుగా నేరుగా వరి విత్తే పద్ధతి కొనసాగుతుందని, తద్వారా కూలీల కొరత అధిగమించి లాభాలను గడించడం జరుగుతుందని తెలిపారు. డ్రోన్ సహాయంతో ఐదు ఎకరాల్లో వరి విత్తడం జరిగిందన్నారు.
కూలీల కొరతను అదిగమించడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి, అధిక దిగుబడులు రాబట్టడానికి పరిశోధనలు జరుగుతున్నాయని, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ ఎన్.లింగయ్య తెలిపారు. ఎకరానికి నేరుగా విత్తే పద్ధతిలో ఆరు కిలోల వడ్లు సరిపోతుందని, డ్రోన్లతో విత్తనం ఒక ఎకరంలో విత్తడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హాలియా వ్యవసాయ సహాయ సంచాలకులు సరిత, మండల ఏఓ పార్వతీ చౌహాన్, కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్, శాస్త్రవేత్తలు సంధ్యారాణి, నళిని, ఏఈఓలు నాగరాజు, స్వాతితో పాటు వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
Tripuraram : నేరుగా విత్తే పద్ధతితో కూలీల కొరతను అధిగమించవచ్చు : వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్