ఆలేరు టౌన్, మార్చి 9 : కరువు కోరలు తాండవిస్తున్నా, రైతులు అరిగోస పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని, ఆయనకు ఎద్దు వ్యవసాయం తెలియదని మాజీ డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరు మండలం శివలాల్ తండా గ్రామంలో నీళ్లు లేక ఎండిన గిరిజన రైతులు ధారావత్ నీలమ్మ , పద్మమ్మ, ధరణమ్మ, బాలమ్మ వరి పొలాలను సోమవారం ఆయన పరిశీలించారు. ధారావత్ నీలమ్మను ఓదార్చారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు కష్టాలు పడకూడదని మాజీ సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ అందించారని, కాంగ్రెస్ పాలనలో లో ఓల్టేజీ సమస్యతోపాటు సకాలంలో సాగు నీరందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పొలాలకు ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో ఎంతో కష్టపడి నిర్మించిన కాళేశ్వరం నీళ్లు ఆపి, చెరువులు, కుంటలు నింపకుండా రైతుల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. గత సంవత్సరం దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ జిల్లా నుంచి నీళ్లు తీసుకొచ్చి గుండ్ల గూడెం, శివలాల్ తండా, కందిగడ్డ తండా, టంగుటూరు, కొల్లూరు, శారాజీపేట, గొలనుకొండ తదతర గ్రామాల్లో చెరువులు నింపి నీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రియల్టర్లుగా మారారని విమర్శించారు. నియోజకవర్గంలో ఎవరైనా భూమి పంచాయితీ విషయంలో తన దగ్గరికి వస్తే ఎమ్మెల్యే అయిలయ్య ఇద్దరినీ మభ్యపెట్టి ఆ భూమిని కబ్జా చేసే స్థాయికి ఎదిగాడని ఆరోపించారు.
అనంతరం ఆలేరు మండలంలోని శ్రీనివాసపురం గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించారు. నడుచుకుంటూ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత రెండు నెలలుగా తాగడానికి నీళ్లు రావడం లేదని, బోర్లు ఎండిపోయి గోస పడుతున్నామని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నీళ్ల కోసం తాసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాధపాక నాగరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ , పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం, మాజీ సర్పంచులు ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, బక్క రామ్‌ప్రసాద్, కోటగిరి పాం డరి, వడ్ల నవ్యశోభన్బాబు, బీఆర్ఎస్ నాయకులు రామనర్సయ్య, గవ్వల నర్సింహులు, పంతం కృష్ణ, మల్లేశ్‌గౌడ్, కొరుకొప్పుల కిష్టయ్య ఉన్నారు.