నల్లగొండ సిటీ, జూన్ 06 : భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చే అమ్మ, కనగల్ మండలం ధర్వేశిపురంలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షి 23వ వార్షిక కల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవోపేతంగా జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు కల్యాణ వేడుకను నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ అమ్మవారు, జమదగ్ని మహాముని ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కల్యాణ మండపానికి కోలాటం బృందాలు, డప్పు చప్పుల్లతో తీసుకువచ్చారు. శ్రావణ్ కుమార్ చార్యులు, నాగోజు మల్లాచారి, సుదర్శనాచార్యులు, దామోదర్ రావు, మహేశ్ అర్చకత్వంలో కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అంతకుముందు అమ్మవారికి ఎదుర్కోలు నిర్వహించారు.
అమ్మవారికి ఆలయ చైర్మన్ వెంకట్‌రెడ్డి దంపతులు, ఆలయ ఈఓ జిల్లెపల్లి జయరామయ్యతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అమ్మవారి కల్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో తాసీల్దార్ పద్మ, నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రన్న గౌడ్, నాగేశ్వరరావు, ఉపేందర్‌రెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.
Nalgonda City : ఘనంగా ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ కల్యాణం