కోల్‌కతా : టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశను వెస్టిండీస్ అజేయంగా ముగించింది. కోల్‌కతా వేదికగా గ్రూప్-సీలో ఇటలీతో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన విండీస్.. 42 పరుగులతో ప్రత్యర్థిని ఓడించింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టుకు షై హోప్ (46 బంతుల్లో 75, 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా రూథర్‌ఫర్డ్ (15 బంతుల్లో 24*) మెరుపులు మెరిపించాడు.
దీంతో ఆ జట్టు 20 ఓవర్లకు 165/6 స్కోరు చేసింది. నిర్దేశిత లక్ష్య ఛేదనలో ఇటలీ 18 ఓవర్లలో 123 రన్స్‌కే ఆలౌట్ అయింది. షెమర్ జోసెఫ్ (4/30) నాలుగు వికెట్ల ప్రదర్శనకు తోడు మాథ్యూ ఫోర్డ్ (3/19) ప్రత్యర్థిని నిలువరించారు. విండీస్ పేసర్ల ధాటికి ఇటలీ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. బెన్ మనెంటి (26) టాప్ స్కోరర్. భారీ ఆశలతో తొలిసారి ఈ టోర్నీకి అర్హత సాధించిన ఇటలీ.. ఓటమితో తమ ప్రస్థానాన్ని ముగించింది. విండీస్ సారథి హోప్‌నకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.