లండన్, ఫిబ్రవరి 19: లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కళంకం బ్రిటిష్ రాజ కుటుంబాన్ని వీడటం లేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన మాజీ ప్రిన్స్, కింగ్ చార్లెస్-3 సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్ను గురువారం యూకేలో నార్ఫోక్లో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రిటన్ ప్రత్యేక వాణిజ్య రాయబారిగా ఉన్న సమయంలో ఆయన జెఫ్రీ ఎప్స్టీన్కు కొన్ని వాణిజ్య నివేదికలను, దేశానికి సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని పంపారన్న ఆరోపణలపై తాజాగా ఆండ్రూను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం బెర్క్‌షైర్, నార్ఫోల్క్లలో సోదాలు నిర్వహించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అతనిపై నమోదైన ఆరోపణల గురించి మాత్రం తెలుప లేదు. అతడి 66వ పుట్టిన రోజున ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. కాగా, కింగ్ చార్లెస్-3 విడుదల చేసిన ప్రకటనలో కూడా ఆండ్రూ అరెస్ట్‌ను ధ్రువీకరించారు. ‘చట్టం తన పనిని తాను చేసుకుపోనివ్వండి. దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్న వేళ దానిపై వ్యాఖ్యానించడం సరి కాదు. నేను నా కుటుంబం మా విధి నిర్వహణ, ప్రజాసేవలో యథావిధిగా కొనసాగుతాం’ అంటూ ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆండ్రూ అరెస్ట్‌పై ప్రధాని కీర్ స్టార్మర్ వ్యాఖ్యానిస్తూ చట్టం ముందు ఎవరూ అతీతులు కాదన్న సూత్రం తమ దేశంలో తప్పక అమలవుతుందని అన్నారు.
ఆండ్రూ మౌంట్‌బాటెన్ జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఎప్స్టీన్తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నట్టు పలు ఆధారాలతో వెల్లడైంది. ఆండ్రూ తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశాడని వర్జీనియా గీయుఫ్రే అనే మహిళ ఆమె టీనేజీలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయగా, దానిని ఆయన ఖండించాడు. కేసు కోర్టు విచారణకు వెళ్లకుండా 2022లో రాజీ కుదుర్చుకున్నాడు. దీంతో అతడిని అన్ని రాజరిక విధుల నుంచి తొలగిస్తున్నట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది.