నీలగిరి, జూలై 18 : నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా నేటికి ప్రారంభించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి శనివారం ఫ్లై ఓవర్ వద్ద స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మెరుపు ధర్నా నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు, స్థానికులతో కలిసి రోడ్డుకు అడ్డంగా కూర్చోని ధర్నా చేయడంతో గంటన్నరపాటు జాతీయ రహదారిపై వాహనాలు నాలుగు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలోని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో వారు ఫ్లై ఓవర్ మీదుగానే సంఘటనా స్థలం వద్దకు వచ్చి అందోళన విరమించే ప్రయత్నం చేశారు.
భూపాల్ రెడ్డి తదితరులు కలెక్టర్ వచ్చి ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తేనే అందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు. అయితే పోలీసులు కంచర్లను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన ఫ్లై ఓవర్ మీదుగా వాహనదారులను వెళ్లాలని చెప్పి, కార్యకర్తలతో పక్కకు జరగడంతో వాహనాలు ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లేందుకు ముందుకు వచ్చాయి. దీంతో పోలీసులు వాహనాల తాళాలను గుంజుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్న భూపాల్‌రెడ్డిని బలవంతంగా తరలించే ప్రయత్నంలో ఆయన చొక్కా చినిగిపోయింది.

కంచర్లతోపాటు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. వాహనాలన్నీ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్తుండటంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి వాహనాలను నిలిపి వేశారు. అరెస్టు చేసిన కంచర్ల, తదితర నేతలను పోలీసులు దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఫ్లై ఓవర్ పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా ప్రారంభించకపోవడంతో పలు ప్రమాదాలు జరిగి జనం ప్రాణాలు కోల్పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యను తేవడంతో రెండుచోట్ల బైపాస్ రహదారులకు నిధుల మంజూరు చేశారన్నారు.
పానగల్ బైపాస్‌ను ఎప్పుడో ప్రారంభించామన్నారు. రాజకీయ కారణాలతో మర్రిగూడ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఫ్లై ఓవర్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఆర్వో మాలె శరణ్యారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కార్పొరేటర్లు రత్నగిరి శ్రీనివాస్, దొడ్డి రమేష్, మారగోని గణేష్, గోపగోని స్వాతి రాజశేఖర్, బణావత్ దీప్లానాయక్, కుందూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దేప వెంకట్‌రెడ్డి, అయితగోని యాదయ్య, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, అభిమన్యు శ్రీనివాస్, మాతంగి అమర్, సింగం లక్ష్మీ రామ్మోహన్, కందుల లక్ష్మయ్య, జమాల్ ఖాద్రీ, యుగేందర్‌రెడ్డి, బొజ్జ వెంకన్న, పెరిక కరణ్ జయరాజ్ తదితరులు ఉన్నారు.
