నీలగిరి, సెప్టెంబర్ 2 : బీసీ సమగ్ర కుల గణన చేపట్టి 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ బీసీ కుల గణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టారని, అధికారంలోకి వచ్చి 9నెలలు గడుస్తున్నా కాలం వెల్లదీస్తూ వస్తున్నారని అన్నారు.
బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించడం సరి కాదని తెలిపారు. బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్‌కు అందించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నల్లా సోమమల్లయ్య, కేశబోయిన శంకర్, కాశయ్య, సీతారాములు, కోటప్ప, చొల్లేటి రమేశ్, మధు యాదవ్, అమరోజు గీత, బంటు కవిత పాల్గొన్నారు.