నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 19 : అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నల్లగొండ డీఈఓను విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రముఖ డీఈఓ అవినీతి బాగోతం నడిపిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన 10వ తరగతి మూల్యాంకనలో డబ్బులు వసూలు చేసి వేరే జిల్లాలకు చెందిన విద్యార్థులకు మార్కులు ఎక్కువ వేయించినట్లు తెలిపారు. గత నాలుగైదు సంవత్సరాల నుండి ఈ తంతు జరుగుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రముఖ టీచర్స్ యూనియన్ సంఘం నేత ఫిర్యాదు ఇచ్చినా ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు.
ఉపాధ్యాయ సంఘ నేత ఒకరు ఐదారేండ్ల నుండి బడికి వెళ్లకుండా దొంగ సంతకాలు పెట్టుకుంటూ డీఈఓతో అంటకాగుతూ ఆఫీసులో ఏ పనైనా తన ద్వారానే అవుతుదని ప్రచారం చేసుకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపారు. గుండ్రంపల్లి ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయుడు వెంకట్‌రెడ్డికి తన స్పోజ్ ఈ జిల్లాలలో లేకున్నా హౌస్ పాయింట్స్ ఇప్పించి బదిలీలో గుడ్రంపల్లికి ఇప్పించారు. ఎంపీపీ ఎస్ కటోరిగూడెం పాఠశాలలో 30 మంది విద్యార్థులు కూడా లేరు అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు మరో ఉపాధ్యాయుడు డిప్యూటేషన్ లో ఉన్నారు. అంటే ఒకరి బదులు మరొకరు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అతడు మాత్రం డీఈఓ ఆఫీస్ లో పైరవీలు చేసుకుంటూ డబ్బులు దండుకుంటున్నట్లు వెల్లడించారు. సదురు ఉపాధ్యాయుడిపై పత్రికల్లో వచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అలాగే చందంపేట మండలం పోలేపల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో మహిళ ఎస్జీటీ టీచర్ కోరుకొండ పాఠశాలలో పనిచేసేది. ప్రస్తుతం ఆ స్కూల్‌ను విద్యార్థులు రాక మూసేశారు. సదర్ టీచర్‌ను డిప్యూటేషన్ వేయకుండా గతేడాది నుంచి జీతం ఇవ్వడం జరిగిందన్నారు. ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తే ఫెయిల్ అయిన అభ్యర్థులను పాస్ చేయించడం జరిగిందన్నారు.
కావున వెంటనే విచారణ చేసి డీఈఓను, సదురు ఉపాధ్యాయ సంఘం నేతని సస్పెండ్ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సింగం లక్ష్మీనారాయణ, ఎల్ హెచ్ పి ఎస్ అధ్యక్షుడు సైదా నాయక్, మిర్యాలగూడ జిల్లా కన్వీనర్ అల్లంపెళ్లి కొండన్న, జిల్లా కో కన్వీనర్ వినోద్ చారి, జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి, సూర్య, నవీన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Nalgonda : నల్లగొండ డీఈఓపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ధర్నా