చౌటుప్పల్, మార్చి 11 : ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట బుధవారం రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. హైడ్రాతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రియల్ వ్యాపారులను అడుక్కునే పరిస్థితికి తెచ్చిందని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ తెరపై తెచ్చి వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2022 కన్నా ముందు జరిగిన డాక్యుమెంట్లను ఎల్ఆర్ఎస్ లేకుండా చేయాలని పేర్కొన్నారు. దీని తర్వాత జరిగిన లేఔట్లలోని డాక్యుమెంట్లకు మార్చి 31 కాకుండా డిసెంబర్ 31 వరకు గడువు పెంచాలన్నారు. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల కింద రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకు కూడా ఎల్ఆర్ఎస్ కట్టాలని సబ్ రిజిస్టర్ చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.