యాదాద్రి భువనగిరి, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ఇసుక అక్రమ దందా రైతుల పాలిట శాపంగా మారింది. కొందరు అక్రమార్కులు అడ్డగోలుగా, అనుమతుల్లేకుండా ఇసుకను తీస్తూ పంట పొలాలు ఎండిపోవడానికి కారణమవుతున్నారు. తమ స్వార్థం కోసం ఎక్కడికక్కడ భూగర్భ జలాలు ఇంకిపోయేందుకు కారకులవుతున్నారు. ఫలితంగా పంటలపై ప్రభావం పడుతోంది. దీనిపై యాదగిరిగుట్ట మండల రైతులు సోమవారం ప్రజావాణిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తమ గోడును వెల్లబోసుకున్నారు. గంధమల్ల చెరువు మత్తడి వాగు యాదగిరిగుట్ట మండలం మీదుగా పారుతోంది. ఈ నీటి ద్వారా ధర్మారెడ్డి గూడెం, కంటం గూ డెం గ్రామాల్లో బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో రైతులు వందల ఎకరాల్లో పంటలు వేశారు.
ధర్మారెడ్డి గూడెం వద్ద ఉన్న ప్రభుత్వ చెక్ డ్యాం వద్ద కొందరు ఇసుక అక్రమ వ్యాపారులు, ట్రాక్టర్ యజమానాలు ఏకమై విచ్చలవిడిగా దందా చేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను యథేచ్ఛగా తోడుతున్నారు. ఇలా జిల్లాలోని వివిధ మండలాలతో పాటు పక్క జిల్లాలకు తరలిస్తున్నారు. రోజుకు 30కి పైగా ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా జోరు గా ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఫలితం గా వాగుల్లో నీరు నిలిచే పరిస్థితి లేదు. బో ర్లు, బావుల్లో భూగర్భ జలాల్లో అడుగంటి వరి పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే యాసంగిలో నీళ్లు లేక చాలా గ్రా మాల్లో పంట పొలాలు ఎండి.. కరువు ఛా యలు దర్శనమిస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు రైతులు అరిగోస పడుతున్నా అధికారులు, పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ధర్మారెడ్డిగూడెంలోని వాగు వద్ద ప్రభుత్వ చెక్ డ్యాం ఉంది. అక్కడి నుంచి నిత్యం పెద్ద మొత్తంలో ఇసుకను తోడుతున్నారు. రోజుకు 30 ట్రాక్టర్లకు మించి ఇసుకును రవాణా చేస్తున్నారు. ఇసుకను తోడటం వల్ల వాగు వచ్చినప్పుడు నీరు నిలవడం లేదు. అంతే కాకుండా భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. మా పంటలపై ప్రభావం పడుతోంది. అధికారులు స్పందించి అక్రమ ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి.