సూర్యాపేట, జూలై 27 : పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డీఓలు, తాసీల్దార్లతో శనివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి సమస్యల పరిష్కారానికి వివిధ మాడ్యూల్స్‌లో దాఖలైన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు.
పెండింగ్ దరఖాస్తులను రెండు వారాల్లో పూర్తి చేయాలని, కోర్టు కేసులు, లోకాయుక్త కేసుల్లో ఉన్న వాటిపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల పెండింగ్‌కు కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ధరణి దరఖాస్తులను పరిశీలించకుండా తిరస్కరించవద్దని, తిరస్కరణకు గల కారణాలను దరఖాస్తుదారుడికి తెలుపాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ డివిజన్ల వారీగా సమీక్షించి అనుమతి లేకుండా ఇసుక తరలించే వాహనాలను సీజ్ చేసి ఆర్డీఓల ద్వారా నివేదిక పంపాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీఓలు సూర్యనారాయణ, శ్రీనివాస్, వేణుమాధవ్, తాసీల్దార్లు పాల్గొన్నారు.