హాలియా, నవంబర్ 13 : సమైక్య పాలనలో అభివృద్ధికి నోచని నాగార్జునసాగర్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ పాలనలో కేవలం ఐదేండ్లలోనే కొత్తరూపు సంతరించుకున్నది. 35 ఏండ్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా పని చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి చేయలేని పనులను, పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలను స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించింది. 2018లో నాగార్జునసాగర్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగిరిన తరువాత నియోజకవర్గంలో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది. విద్య, వైద్యం, ప్రజారోగ్యం, తాగు, సాగునీటితోపాటు విద్యుత్ లోఓల్టేజీ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. పరిపాలనా సౌలభ్యం కోసం హాలియా, నందికొండలను మున్సిపాలిటీలుగా చేయడంతోపాటు తిరుమలగిరి(సాగర్)ను నూతన మండలంగా ఏర్పాటు చేసింది. గత ఎన్నికల సమయంలో హాలియా వేదికగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయడంపై నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు.
అభివృద్ధిలో దూకుడు..
2021 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్‌కుమార్ గెలిచిన తరువాత నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిలో దూకుడు పెరిగింది. గడిచిన రెండున్నరేండ్లలో ఎమ్మెల్యే భగత్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గానికి రూ.1,500 కోట్ల నిధులు తీసుకొచ్చారు. వీటితో గ్రామాలు, గిరిజనతండాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామ, పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, రూ.684 కోట్లతో నెల్లికల్ లిఫ్ట్ పనులు చేపట్టడం, బుద్ధవనాన్ని పూర్తి చేసి సాగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, సాగర్ ఎన్ఎస్పీ క్వాటర్స్‌లో నివాసం ఉంటున్న వారికే వాటిని కేటాయించడం, గిరిజనతండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, హాలియాలో బంజారా భవన్ నిర్మాణానికి నిధుల మంజూరు, హాలియా, నిడమనూరు, త్రిపురారం, పెద్దవూర మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుతో నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గడిచిన ఐదేండ్లలో నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందింది. కొత్తగా 10 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేసి విద్యుత్ లోఓల్టేజీ సమస్యను పరిష్కరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో..
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తిరుమలగిరి(సాగర్) నూతన మండలంగా ఏర్పాటైంది. హాలియా, నాగార్జునసాగర్ పట్టణాలు మున్సిపాలిటీలయ్యాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు వచ్చింది. రాజవరం మేజర్‌కాల్వ చివరి భూములకు సాగునీరు వచ్చింది, గిరిజన తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. నియోజకవర్గానికి రెండు డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు(హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్‌లో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల). కృష్ణపట్టె ప్రాంతంలో బీడు భూములకు నీరందించేందుకు రూ.684 కోట్లతో నెల్లికల్ లిఫ్ట్ మంజూరు చేసి పనులు చేపట్టారు. సబ్ జూనియర్ కోర్టు ఏర్పాటు, రూ.18 కోట్లతో సాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రి ఆధునీకరించారు. ఏఎమ్మార్పీ లో లెవల్ కెనాల్(వరదకాల్వ)ను పూర్తి చేసి 80 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. నియోజకవర్గంలోని వాగులు, వంకలపై చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో భూగర్భజలాలు పెరిగాయి. బుద్ధవనం నిర్మాణం పూర్తయ్యింది.
గత పాలకులు చేసిందేమీ లేదు..
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడింది. తలాపున కృష్ణమ్మ పరుగెడుతున్నప్పటికీ తాగునీరు లేక, కాల్వ చివరి భూములకు సాగునీరు అందక ప్రజలు హరిగోస పడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇక్కడి నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా పని చేసినప్పటికీ ఆయన ప్రజలకు చేసిందేమీ లేదు. హరిజన, గిరిజనులను ఓటుబ్యాంక్‌గా వాడుకున్నారే తప్ప వారి అభివృద్ధికి పాటుపడిన దాఖలాలు లేవు.
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి..
నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపొందిన తరువాతు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఆయన తనయుడు నోముల భగత్ కుమార్ గడిచిన ఐదేండ్లలో ఇరిగేషన్ రంగంపై రూ.848 కోట్లు ఖర్చు చేశారు. పట్టణాభివృద్ధికి రూ.112.20 కోట్లు, మౌలిక వసతుల కోసం రూ.755 కోట్లు, ఆరోగ్యరంగానికి రూ.25 కోట్లు, మిషన్ భగీరథకు రూ.108.57 కోటు, విద్యకు రూ.25 కోట్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.30 కోట్లు, విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి రూ.686 కోట్లు ఖర్చు చేశారు. హాలియాలో 50 పడకల ఆస్పత్రి, పోస్టుమారం సౌకర్యం కల్పించారు. నియోజకవర్గంలో రూ.684 కోట్లతో నెల్లికల్ లిఫ్ట్ నిర్మాణం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కోసం రూ.40 కోట్లు, వరదకాల్వ పూర్తి, పంప్‌హౌజ్ పెండింగ్ బిల్లుల కోసం మరో రూ.55 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మిషన్ కాకతీయ కింద రూ.40 కోట్లతో 230 చెరువులకు మరమ్మతులు చేపట్టారు. నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతోపాటు ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి గడిచిన నాలుగేండ్లలో రూ.112 కోట్లు మంజూరయ్యాయి. 42 కోట్లతో హాలియా మున్సిపాలిటీలో, 70 కోట్లతో నందికొండ మున్సిపాలిటీలో పనులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లు, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ యార్డు, డిజిటల్ లైబ్రరీ, వైకుంఠదామం, ఆడిటోరియం, మినీ స్టేడియం వంటి నిర్మాణాలతో హాలియా, నందికొండ మున్పిపాలిటీలు కొత్తశోభ సంతరించుకున్నాయి.