తిరుమలగిరి, జూలై 12 : భూగర్భ జలాలు జిల్లాలో రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వానలు పడకపోవటంతో రైతులు భగీరథ యత్నం చేస్తున్నారు. నీటి కోసం వానకాలంలో సైతం పాతాళ గంగను వెలికి తీస్తున్నాడు. గుక్కెడు నీటి కోసం 400 అడుగులకు పైగా బోర్లు వేస్తున్నాడు. భూమిని నమ్ముకున్న రైతు సాగు చేయటానికి బోరు బావుల వైపు దృష్టి సారిస్తున్నాడు. భూగర్భ జలాలు అడుగంటి నీరు అందించే బోర్లు సైతం వట్టి పోవడంతో రైతులు దిక్కుతోచని స్దితిలో ఉన్నారు. ‘మట్టిలో మానెడు పోస్తే ఇంటికి పుట్టెడు ధాన్యం వచ్చే రోజులు పోయినయి. మట్లే పుట్టెడు పోస్తే ఇంటికి మానెడు వచ్చే రోజులు వచ్చినయ్. వ్యవసాయంలో పెట్టు బడి ఖర్చులు విపరీతంగా పెరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ పథకంతో చెరవులు కుంటల్లో పూడికతీయటంతో వాన కాలం, యాసంగి తేడా లేకుండా గోదావరి జలాలతో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగు నీరు అందించి, చెరువులు, కుంటలు నింపటంతో వేసవిలో సైతం చెరువులు, కుంటలు నిండు కుండల్లా కనిపించేవి. భూగర్భ జలాలు పెరిగి 30 అడుగుల్లోనే పుష్కలంగా నీరు లభించేది. ప్రస్తుతం నాలుగు వందల ఫీట్ల లోతులో కూడా నీటి చెమ్మ కనిపించడం లేదు. ఇప్పటికే నాట్లు వేసే రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు చూడాల్సిన దుస్థితి నెలకొంది. నాణ్యమైన విద్యుత్తు సరఫరా కాక ఉన్న బోరు మోటార్లు సైతం కాలిపోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెల కొనటంతో ఈ సారి వానకాలం సాగు కత్తిమీద సాములా మారింది.
వరి సాగుపై నీలినీడలు
జిల్లాలో వరి ప్రధాన పంటగా సాగవుతుంది. రైతులు రోహిణి కార్తెలో నార్లు పోశారు. పొలాలు దున్ని నాట్లు వేయాల్సిన తరుణంలో కనీసం దున్నుడు ప్రక్రియ చేపట్టక పోవటానికి వర్షాభావమే కారణమని అంటున్నారు. ఈ సారి వ్యవసాయ శాఖ వరి సాగు అంచనా 4,94,500 , పత్తి సాగు 90.800గా అంచనా వేసారు. కానీ ఎల్‌నినో ప్రభావంతో ఎక్కడా ఆశించిన స్థాయిలో పంటల సాగు కాలేదు. సగానికి తగ్గిన సాగుతో రైతులు వర్షాలకోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలు పంటల సాగు లేక వెల వెల పోతున్నాయి.
ఒక్కో బోరుకు రూ .లక్ష ఖర్చు..
బోర్లు సైతం వట్టి పోతుండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అప్పులు తెచ్చి మరీ బోర్లు వేయిస్తున్నారు. గతంలో రూ. 50 వేల ఫీట్ల వరకు బోరు వేసేది. ప్రస్తుతం భూగర్బ జలాలు అడుగంటి పోవటంతో రైతులు 250 ఫీట్ల నుంచి 400 ఫీట్ల లోతు వరకు బోర్లు వేసినా ఫలితం ఉండటం లేదు. పెరిగిన డీజిల్ ,పెట్రోల్ ధరకు అనుగుణంగా ఫీటుకు రూ. 160 చొప్పున బోరు వేస్తున్నారు. కేసింగ్ రూ. 450 చొప్పున వేస్తున్నారు. కేసింగ్ కనీసం 70 నుంచి 90 ఫీట్ల వరకు వేస్తున్నారు. దీనితో ఒక్కో బోరు తవ్వకానికి రూ. లక్షకు పైగా ఖర్చు వస్తోంది. ఒక బోరు పడకుంటే మరో బోరు వేసి ఇలా రైతులు అప్పుల పాలవుతున్నరు. దీ నికి తోడు పెట్రో ల్, డీజిల్ ధరలు, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగటంతో సాగు ఖర్చులూ విపరీతంగా పెరిగాయి.
చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం..
వాస్తవానికి జూలై రెండో వారంలోనే విత్తనాలు విత్తాలి. ఆ తర్వాత విత్తితే చీడపీడల ఉధృతి పెరిగి పంట ఎదుగుదల దెబ్బతిని దిగుబడి తగ్గి పోతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా రైతులు సైతం తక్కువ నీటితో వచ్చే పంటలు ,కరువును తట్టుకునే వంగడాలపై దృష్టి సారిస్తే మంచిదని చెబుతున్నారు. కోత ఆలస్యం అయితే మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉండి రైతులు నష్టపోవాల్సి వస్తుంది. రైతులు ఇప్పటికే నార్లు పోసి సాగు కోసం చూస్తున్నారు. కొన్ని చోట్ల నారు ముదురు తుం డగా, మరికొన్ని చోట్ల నాసిరం విత్తనాలతో నా రు ఎదుగుదల నిలిచిపోయి రెండో సారి నా ర్లు పోస్తున్నారు. ముందుకు పోతే నుయ్యి.. వెనుకకుపోతే గొయ్యి అన్న చం దంగా రైతులు పరిస్థితి ఉంది.
కన్నీరు మిగిల్చిన జూన్
నాగలి పట్టి పంట సాగు చేయాల్సిన రైతులు వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో జూన్ నెలలో పంట చేలు రైతులను పలకరించేవి. వ్యవసాయ క్షేత్రాలు పంటచేలతో కనిపించేవి. కలుపు తీస్తూ , చేలలో గుంటుక తిప్పుతూ కనిపించే రైతులు, ప్రస్తుతం అడపా దడపా కురుస్తున్న వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. నాట్లు పెట్టాల్సిన పరిస్థితిలో నార్లు పోసి కాలం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. జూలైలో అయినా తమను వరుణుడు కరుణిస్తాడేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
రెండు బోర్లు వేసినా చుక్కనీరు రాలేదు..
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాల్వల ద్వారా సాగునీరు అందేది. చెరువులు ,కుంటలు నిండటంతో నీళ్లు కష్టం రాలేదు. 8 సంవత్సరాల నుంచి ఒక్క బోరు కూడా వేయలేదు. కాల్వల నీళ్లతోనే పంటలు పండించుకున్న. రెండు సంవత్సరాల నుంచి సాగు నీరు సక్రమంగా అందక చెరువులు ,కుంటలు వట్టి పోయి, భూగర్భ జలాలు అడుగంటాయి. 250 ఫీట్ల వరకు రెండు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. దాదాపు రెండు లక్షల వరకు అప్పుచేయాల్సి వచ్చింది. వ్యవసాయం అంటేనే రైతులు భయపడాల్సిన పరిస్థితి ఉంది.
-మాళోతు శంకర్, మర్రికుంట తండా, తిరుమలగిరి
ఆరు బోర్లు వేస్తే ఒక్కటీ పడలేదు..
నాకు 7 ఎకరాల వ్యవ సాయం ఉంది. ఉన్న ఒక్క బోరు ఆగి పోస్తుండటంతో సాగు నీరు లేక ఇటీవల 6 బోర్లు వేయించినా ఒక్క బోరు కూడా పడలేదు. 5 లక్షలు ఖర్చయ్యాయి. చుక్క నీరు రాలేదు. గతంలో భూగర్భ జలాలు ఉండి ఒక్క బోరుతోనే మొత్తం వ్యవసాయం సాగింది. ప్రస్తుతం చెరువులు ,కుంటలు ఎండిపోయి. 200 ఫీట్ల కింద కూడా నీటి చెమ్మ కనిపించటం లేదు. కాలం కాక సాగు నీరు అందకు రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయి. ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి.
-ఆంగోతు రాములు,రైతు, నెల్లిబండ తండా తిరుమలగిరి