భువనగిరి కలెక్టరేట్, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కె. నారాయణరెడ్డి కోరారు. బడిబాటలో భాగంగా గురువారం భువనగిరి మండలంలోని అనాజీపురం ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
6 నుంచి 14 నంవత్సరాల పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న వసతులు, పథకాలు, నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందజేసే డ్రెస్సులు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనాలు, డిజిటలైజేషన్ తరగతులపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పి.నాగవర్ధన్రెడ్డి, సీఎంఓ పెసరు లింగారెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ రాయపురం ప్రీతి, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.