భూదాన్ పోచంపల్లిలో ఐఐహెచ్‌టీ.. నేతన్నల చిరకాల స్వప్నం, ఆకాంక్ష. కార్మికుల సెంటిమెంట్, భావోద్వేగంతో కూడిన డిమాండ్. కానీ కార్మికుల ఆశలను ప్రస్తుత కాంగ్రెస్ కల్లగానే మిగులుస్తున్నది. దశాబ్దాలుగా కొట్లాడి తెచ్చుకున్న ప్రఖ్యాత సంస్థను గద్దలా ఎగరేసుపోతున్నది. పోచంపల్లిలోనే ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటనతో చేనేతల్లో మళ్లీ ఆశలు రేకెత్తాయి.
దేశంలోనే అత్యుత్తమ చేనేత నైపుణ్య విద్యాసంస్థగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పేరుంది. విద్యకు ఐఐటీ మాదిరిగా చేనేతకు ఐఐహెచ్టీగా పరిగణిస్తారు. అయితే పోచంపల్లిలో ఐఐహెచ్‌టీ కోసం ఎన్నో ఏండ్లు పోరాటాలు జరిగాయి. పద్మశాలి, నేత కార్మిక సంఘాలు దీనిపై అనేక విజ్ఞాపనలు చేశాయి. గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర మంత్రులు కేంద్రానికి వినతులు అందించాయి. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సంస్థను మంజూరు చేసింది.
పర్యాటక ప్రాంతం, చేనేతకు పేరుగాంచిన పోచంపల్లిలోనే సంస్థను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదనలు ఉన్నాయి. రాష్ర్టానికి మంజూరు కావడంతో పోచంపల్లి మండలంలోని కనుముక్కలలో ఏర్పాటు చేస్తూ గతేడాది ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నేతన్నల కల సాకారమైందని, ఎన్నో ఏండ్లుగా నేత కార్మికుల చేస్తున్న ఆందోళనలు, విజ్ఞప్తులకు సార్థకత లభించిందని ఎంతో సంబురపడ్డారు.
ఐఐహెచ్‌టీని తన సొంత జిల్లాకు తరలించుకుపోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. వాస్తవానికి పోచంపల్లికి ఐఐహెచ్‌టీ మంజూరు కావడంతో ఇక్కడే ప్రారంభించాలి. కానీ సమయాభావం, అత్యవసరం అంటూ గతేడాది తాత్కాలికంగా హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడే ఏర్పాటు చేస్తారని అంతా నమ్మారు. కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫోర్త్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇటు స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేశారు.
రాష్ట్రంలో నలభై వేల చేనేత కుటుంబాలు ఉండగా, అధికంగా భూదాన్ పోచంపల్లిలోనే నేత కార్మికులు ఉన్నారు. పెద్దఎత్తున వస్త్ర వ్యాపారం, తయారీ రంగం ఉంది. ఇక్కడ ఐఐహెచ్‌టీ ఏర్పాటైతే చేనేత, జౌళి, డిప్లొమా డిగ్రీ పీజీ కోర్సులతోపాటు పరిశోధనలు, అభివృద్ధి అధ్యయనాలు జరిగే అవకాశం ఉంటుంది. చేనేత పరిశ్రమ మరింత బలోపేతం అవుతుంది. కనుముక్కలలో ఉన్న హ్యాండ్లూమ్ పార్క్‌లో భవనాలు అందుబాటులో ఉన్నాయి. ఇది 26 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం పార్కులోని విశాలమైన భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. వీటికి మరమ్మతులు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఇటీవల పోచంపల్లిలో జరిగిన కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఐహెచ్‌టీ పోచంపల్లిలోనే ఏర్పాటు చేయాలని పలువురు చేనేత ప్రతినిధుల వినతి పత్రం అందించి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన స్పందిస్తూ.. పోచంపల్లిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో నేతన్నలో మరోసారి ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో పోచంపల్లిలోనే ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వివిధ వర్గాల నుంచి పెరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సైతం ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నాయి.
ప్రభుత్వం మంజూరు చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని భూదాన్ పోచంపల్లిలోనే ఏర్పాటు చేయాలి. భూదానోద్యమం, చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. మారుతున్న కాలానుగుణంగా చేనేత కార్మికులు వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకునేందుకు హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుంది. భావితరాల వారికి ఉపయోగపడుతుంది.
-అంకం పాండురంగం, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు, భూదాన్ పోచంపల్లి
చేనేత కార్మికులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తే మరింత నిష్ణాతులు అవుతారు. చేనేత కళాకారులకు అందుబాటులో ఐఐహెచ్‌టీని ఏర్పాటు చేస్తే పోచంపల్లి ఇకత్ పరిశ్రమ బలోపేతం అవుతుంది. చేనేత పరిశ్రమపై ఆధారపడిన వారందరికీ నూతన టెక్నాలజీతో వస్త్ర వ్యాపారం జరిగి ఉపాధి కలుగుతుంది. కళాకారులు, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. చేనేత పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు అందించిన వారవుతారు.
-భారత లవకుమార్, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు
రాష్ట్రంలోనే తలమానికంగా ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లిలో ఐఐహెచ్‌టీని ఏర్పాటు చేస్తేనే సార్థకత లభిస్తుంది. ప్రభుత్వాలు పలు సంస్థలను భూదాన్ పోచంపల్లికి మంజూరు చేసినా కొందరు స్వార్థంతో రాజకీయాలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రపంచ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రమైన భూదాన్‌పోచంపల్లి మండలంలో హ్యాండ్లూమ్ పార్, రామానంద గ్రామీణ సంస్థలో ఐఐహెచ్‌టీకి అనుకూలమైన భవనాలు, వసతులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వారసత్వ చేనేత కళాకారులు సంప్రదాయ చేనేత వృత్తిని కొనసాగిస్తున్నారు. ఈ సెంటర్ ఇక్కడ ఉంటే చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది.
– కొంక లక్ష్మీనారాయణ, చేనేత కార్మికుడు