నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), ఏప్రిల్ 15 : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం అందించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో అన్ని యూనివర్సిటీల పరిధిలో జరిగే పరీక్షలను యధావిధిగా బహిష్కరిస్తామని తెలంగాణ అఫ్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. గతేడాది దసరాకు ముందు నుంచి వివిధ దశల్లో ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 2 నుంచి జరగాల్సిన డిగ్రీ కాలేజీ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను కళాశాలల యాజమాన్యాలు బహిష్కరించాయి.
అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఈ నెల 11 నుంచి జరగాల్సిన వివిధ డిగ్రీ సెమిస్టర్ థియరీ పరీక్షలను సైతం బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసే వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించమని పేర్కొంటూ మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అవ్వాల రవి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డిను వేర్వేరుగా కలిసి విన్నవించారు. ఈ నెల 16 వరకు జరిగే పరీక్షలను యూనివర్సిటీ వాయిదా వేయగా అదేబాటలో 17 నుంచి జరిగే పరీక్షలను సైతం బహిష్కరిస్తున్నామని ఇందుకు వర్సిటీ సహకరించి తమకు న్యాయం చేయాలని కోరారు.
విద్యా మండలి చైర్మన్కు వినతి పత్రం అందజేసిన వారిలో తెలంగాణ అఫిలియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, భువనగిరి జాగృతి విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ బి.సూర్యనారాయణ రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ చాప్టర్ అధ్యక్షుడు, నల్లగొండలోని నీలగిరి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ మారం నాగేందర్ రెడ్డితో పాటు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రామకృష్ణ, నల్లగొండ సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ గుండెబోయిన జానయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ కళాశాల యాజమాన్యాలు పి.భాస్కర్రావు, హనుమంతు యాదవ్, ధనుంజయ్, డి.ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
Nalgonda : ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే వరకు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు బహిష్కరణ