నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), ఏప్రిల్ 1 : తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2 నుంచి జరిగే డిగ్రీ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ అఫ్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ ఎంజీయూ చాప్టర్ అధ్యక్షుడు, నీలగిరి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ మారం నాగేందర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాలల ఎదుట మంగళవారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది అక్టోబర్ నుంచి దశలవారీగా తెలంగాణ అఫ్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. గత నెల 16న ఎంజీయూ వీసీకి, 23న నల్లగొండ ఆర్డీఓకు వేర్వేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, లేనిపక్షంలో త్వరలో జరగబోయే ప్రాక్టికల్ థియరీ పరీక్షలను బహిష్కరిస్తామని వినతి పత్రాలను అందజేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడంతో ఏప్రిల్ 2 నుంచి జరిగే డిగ్రీ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు గత నాలుగు సంవత్సరాలుగా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయానికి యాజమాన్యాలు సిద్ధమైనట్లు వెల్లడించారు. విద్యార్థుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా నాలుగేళ్లుగా విద్య అందిస్తున్నట్లు చెప్పారు. దీంతో అధ్యాపకుల జీతాలు, భవనాల రెట్లు, కరెంట్ బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్‌లు, యూనివర్సిటీ వివిధ ఫీజులను అప్పులు చేసి చెల్లించినట్లు తెలిపారు. ఇప్పటికే లక్షల రూపాయల అప్పులు అయ్యాయని, ఇక అప్పుచేసి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతోనే చేసేదేమి లేక ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
నల్లగొండ ఎంజీయూ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు గత ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎంజీయూ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి, మాజీ ఓఎస్డీ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డిని కలిసి అధ్యాపకులు తమ గోడు వెలిబుచ్చారు. వేతనాలు ఇవ్వడం లేదు కాబట్టి ఏప్రిల్ 2 నుంచి జరిగే డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ లెక్చరర్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుక్క సైదులు తెలిపారు. తక్షణమే ప్రభుత్వం, అధికారులు స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి పేద విద్యార్థులను, అధ్యాపకులను ఆదుకోవాలని విన్నవించారు. వినతిపత్రం అందజేసిన వారిలో పలు డిగ్రీ అండ్ పీజీ కళాశాలల అధ్యాపకులు ఉన్నారు.
Degree Practical Exams : రేపటి నుంచి జరిగే డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల బహిష్కరణ