యాదాద్రి భువనగిరి, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణ కోసం మతోన్మాద బీజేపీకి తెలంగాణలో అడ్డుకట్ట వేయడమే కమ్యూనిస్టుల కర్తవ్యమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని రాయగిరిలో రెండు రోజుల పాటు జరిగిన సీపీఐ జిల్లా మహాసభలు మంగళవారం ముగిశాయి. ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మునుగోడు నుంచి శాసనసభకు సీపీఐ ఐదు సార్లు ప్రాతినిథ్యం వహించిందని, తమకు అన్ని గ్రామాల్లో ఓటు బ్యాంకు ఉందని అన్నారు. నియోజకవర్గంలో 25 వేలకు పైగా ఉన్న తమ ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వేయడం వల్ల మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకే అని వివరించారు.
బీజేపీ ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో గెలవడం దానికి సాధ్యం కాదన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించన బీజేపీ నాయకులు తాము అధికారంలోకి వస్తే తెలంగాణ వియోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని సంపన్నులకు 12 లక్షల కోట్ల బకాయిలను రద్దు చేశారన్నారు. పేదలకు ఇచ్చే ఉచితాలను ప్రభుత్వ ఖాజానాకు భారమనే చర్చకు తెరలేపి దేశంలో సంక్షేమ పథకాలు లేకుండా చేయాలని బీజేపీ కుట్రపన్నుతోందని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం బలపరిచే టీఆర్ఎస్ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని పేర్కొన్నారు. సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, సహాయ కార్యదర్శులు యానాల దామోదర్‌రెడ్డి బొలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, ఎండీ.ఇమ్రాన్, బండి జంగమ్మ, చెక్క వెంకటేశ్, బోడ సుదర్శన్, ఉప్పల ముత్యాలు, కుసుమాని హరిచంద్ర, చేడే చంద్రయ్య, కొల్లూరి రాజయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్, చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్ష్మీనర్సయ్య, జిల్లా నాయకులు పాల్గొన్నారు.