దేవరకొండ రూరల్, నవంబర్ 28 : ఈ నెల 29న నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చేసిన ఉద్యమ పోరాటం, గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న తెగువతో నాలుగు కోట్ల మందిని ఏకం చేసి, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి, కుల మతాలకు అతీతంగా ఏకం చేసిన దీక్షా దివస్ ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ సంకల్ప బలానికి, దీక్షాదక్షతకు సాక్ష్యం దీక్షా – దివస్ అని పేర్కొన్నారు. అరవై ఏండ్ల గాయాలు, వేదనలను తెలంగాణ కన్నీళ్లను తీర్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. గాలి, నీరు, నేల ఉన్నంత కాలం తెలంగాణలో కేసీఆర్ అనే మూడక్షరాలు పదిలం అన్నారు.