కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. భూములు కొల్లగొట్టేందుకు కాదేదీ అడ్డు అన్న చందంగా ఉంది భువనగిరి పట్టణంలో పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా శ్మశాన వాటికనే నేలమట్టం చేశారు. ధనార్జనే ధ్యేయంగా తాతల కాలం నాటి సమాధులను నేలకూల్చారు. అధికార కాంగ్రెస్ నేతల అండదండలతో ఆగడాలకు పాల్పడ్డారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులతో భయబ్రాంతులు, కేసులు పెట్టి వేధిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, జూలై 30 (నమస్తే తెలంగాణ) : సమాధుల నేలమట్టంపై ఉద్యమించేందుకు అన్ని పార్టీల నేతలతో కలిపి బుధవారం బహుజన శ్మశాన వాటిక పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి ఎదురుగా ఉన్న తాతానగర్‌కు వెళ్లే దారిలో శ్మశాన వాటికలున్నాయి. దశాబ్దాలుగా వివిధ కులాలకు చెందిన శవాలను ఇక్కడే పూడ్చిపెట్టేవారు. ముఖ్యంగా గంగపుత్రులు, ముదిరాజ్‌ల సమాధులు అధికంగా ఉన్నాయి. సర్వే నంబర్ 1064లో సుమారు రెండు ఎకరాల్లో వందలాది సమాధులు ఉండేవి. ఇటీవల కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ పేరుతో కొందరు రంగంలోకి దిగారు. పూర్తిగా గోరీలతో నిండిపోయిన స్థలం తమదంటూ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సహకారంతో జేసీబీలు తెప్పించి ఉన్నపళంగా సుమారు వందకుపైగా గోరీలను కూల్చివేశారు. అక్కడే మున్సిపల్ నిధులతో నిర్మించిన వాటర్‌ట్యాంక్, నళ్లాలు, స్నాన ఘట్టాలను కూడా కూలగొట్టారు. ఆ సమయంలోనే ఇదేంటని ప్రశ్నించిన వారిని కొందరిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. మరికొందరిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి రోజంతా స్టేషన్లోనే ఉంచారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు.
సమాధులను కూలగొట్టడంలో, రియల్ వ్యాపారానికి పట్టణానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇందుకోసం భూమిని గజాల్లో వాటా ఇస్తామని హామీ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎకరం భూమి రూ.కోట్లలో పలుకుతున్నది. ఈ నేపథ్యంలోనే దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటికను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. ఇదే స్థలంలో వెంచర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీని పక్కనే ఇదే సర్వే నంబర్లో గంగపుత్రుల శ్మశానవాటిక ఉంది. మొదటి శ్మశాన వాటికను వెంచర్ చేశాక.. భవిష్యత్‌లో గంగపుత్రుల శ్మశానవాటిక స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారనే ప్రచారం ఉంది.
నేను మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో సమాధుల చుట్టూ మున్సిపల్ నిధులతో ప్రహరీ నిర్మించాం. స్నాన ఘట్టాలు కట్టించాం. వాటర్ ట్యాంక్, నళ్లాలు కూడా ఏర్పాటు చేశాం. 50 ఏండ్ల పైగా శ్మశాన వాటికగా కొనసాగుతోంది. ఇప్పుడు కొందరు తమదంటూ వచ్చిన హంగామా చేస్తున్నారు. కనీసం నోటీసులు లేకుండా మున్సిపల్ కట్టడాలను కూడా కూల్చేశారు. సమాధులను కూల్చేసి రియల్ వ్యాపారం చేయాలని చూడటం సిగ్గుచేటు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్మశాన వాటిక ఉండాలి.