నీలగిరి, నవంబర్ 19 : వయో వృద్ధుల సంక్షేమం కోసం త్వరలోనే డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి తెలిపారు. ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఈ నెల 12 నుండి 19 వరకు కొనసాగిన వారోత్సవ ముగింపు వేడుకలను బుధవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయో వృద్ధుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. వీరికి ఆసరా పెన్షన్‌తో పాటు మెరుగైన జీవనశైలి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తూ వారి కోసం ఉచిత ఆశ్రమం నిర్మాణానికి స్థల కేటాయింపు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లదేనని, వారి పట్ల రెవెన్యూ, పోలీస్ శాఖ ప్రత్యేక చొరవతో వయో వృద్ధుల సమస్యల కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కెవి కృష్ణవేణీ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు ఉన్నప్పుడు వృద్ధాప్యం మరో బాల్యం లాంటిదన్నారు. వీరి కోసం జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ పని చేయడం జరుగుతుందని, వీరి కేసులను సత్వర పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన వయో వృద్ధులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సముద్రాల మల్లికార్జున్, కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, అసోసియేషన్ నాయకులు, అదనపు వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి, మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి, శ్రీకాంత్, సునీల్, ఆఫీస్ సిబ్బంది వెంకట్ రెడ్డి, బాలయ్య, సునీత పాల్గొన్నారు.

Nilagiri : వయో వృద్ధుల సంక్షేమానికి డే కేర్ సెంటర్ : ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి