నల్లగొండ ప్రతినిధి, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్‌గా 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన దాసరి హరిచందన నియామకమయ్యారు. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ కలెక్టర్‌గా రానున్న దాసరి హరిచందన ఇప్పటివరకు ఆయూష్ కమిషనర్ బాధ్యతలతోపాటు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కాగా ఈ నెల ఒకటిన జిల్లా ఎస్పీగా చందనా దీప్తి బాధ్యతలు చేప్టటిన విషయం తెలిసిందే. తాజాగా కలెక్టర్‌గా హరిచందన నియామకంతో జిల్లా చరిత్రలో తొలిసారిగా ఇద్దరూ మహిళా రథసారథులు కావడం విశేషం.
వాస్తవంగా గత నెల 17న జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న ఆర్వీ కర్ణన్(2012)ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న హేమంత్ కేశవ్ పాటిల్(2019) ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. హేమంత్ కేశవ్ పాటిల్ నుంచి గురువారం జిల్లా నూతన కలెక్టర్‌గా హరిచందన బాధ్యతలు చేపట్టనున్నారు. హైదరాబాద్‌కు చెందిన హరిచందన తండ్రి దాసరి శ్రీనివాసరావు కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పర్యావరణ అర్ధశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హరిచందన అక్కడే ఉన్నత ఉద్యోగంలో చేరారు.
ఐఏఎస్ అయిన తన తండ్రి శ్రీనివాసరావు స్ఫూర్తితో తను కూడా సివిల్స్ వైపు దృష్టి సారించి లండన్‌లో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని ఇండియాకు వచ్చేశారు. సివిల్స్ ప్రిపరేషన్లో భాగంగా తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్ సాధించారు. ఐఏఎస్ లక్ష్యంతో 2010లో రెండో అటెంప్ట్‌లో తన లక్ష్యాన్ని సాధించారు. ఐఏఎస్‌కు ఎంపికయ్యాక విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా, తర్వాత విజయవాడ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా, నారాయణపేట జిల్లా కలెక్టర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ వచ్చాక కొత్తగా చేపట్టిన ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న హరిచందన నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇదే సమయంలో ఆర్వీ కర్ణన్‌కు కూడా తాజా బదిలీల్లో తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎంఎస్ఐడీసీ)ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పజెప్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.