కట్టంగూర్, మే 31 : ప్రజలకు మంచినీరు అందించేందుకు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిరుపయోగంగా ఉంది. ప్రారంభానికి నోచుకోక ముందే ట్యాంక్ శిథిలావస్థకు చేరడంతో కాలనీ వాసులకు మంచినీటి తిప్పలు తప్పడం లేదు. కట్టంగూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో గత మూడు సంవత్సరాల క్రితం మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి పైపు లైన్ ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్లో భాగంగా ట్యాంక్‌లోకి నీటిని నింపడంతో అడుగు భాగంలో లీకేజీ అయ్యింది.
దాంతో అధికారులు మంచినీటి సరఫరా నిలిపివేశారు. అధికారులు వచ్చి పరిశీలించి వెళ్తున్నారే తప్పా పరిష్కారం చూపడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో గృహాల మధ్య ట్యాంక్ నిర్మించడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి లీకేజీకి మరమ్మతులు చేపట్టి తాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.