మఠంపల్లి : భారీ వర్షాలకు మఠంపల్లి మండలంలో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మండలంలో మొత్తం వెయ్యి ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు లెక్కలు చెబుతున్నారు.
యాతవాకిళ్ల వేములూరు రిజర్వాయర్ ఉప్పొంగి ప్రవహించడంతో రిజర్వాయర్ కింద ఉన్న గ్రామాలు, తండాలు జలమయమయ్యాయి. బిల్యానాయక్తండా, బాడవతండా, మంచ్యా తండా, కామంచి కుంట తండా, చెన్నాయిపాలెం, వర్దాపురంలో సుమారు 60మోటార్లు కొట్టుకుపోయాయి. మంచ్యాతండా సమీపంలో బీటీ రోడ్డు కోసం మెటల్ రోడ్డు పోయగా మొత్తం కొట్టుకుపోయింది. సుమారు రూ.25లక్షలు నష్టం వాటిల్లింది.
మండల కేంద్రంలోని మామిళ్ల చెరువు కట్ట తెగడంతో సుమారు 100ఎకరాల్లో రాళ్లు తేలాయి. చౌటపల్లి ఊర చెరువు మొత్తం దెబ్బతినడంతో చెరువు లూటీ అయ్యింది. రఘునాథపాలెం, గుండ్లపల్లి గ్రామాల్లో పత్తి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలో అన్ని చెరువుల మరమ్మతులకు రూ.10కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్అండ్బీ రహదారులు, బ్రిడ్జిలు, చెరువులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.