యాదగిరిగుట్ట, ఏప్రిల్ 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం జరిపించారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధిసేవ, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా జరిగాయి.
సుదర్శన నారసింహ హోమం పాంచరాత్రగమశాస్త్ర రీతిలో సాగింది. ఉదయం ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శన నారసింహ హవనం జరిపారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవను చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే ఈ సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధిసేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. స్వామివారిని సుమారు 10వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి ఖజానాకు రూ.17,93,215 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారి సేవలో ప్రముఖులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్, హైదరాబాద్ ఎస్బీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశ్వప్రసాద్ కుటుంబ సమేతంగా వేర్వేరుగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారి రాజన్‌బాబు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.