 
                                                            నల్లగొండ ప్రతినిధి,అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మొంథా తుపాన్ ధాటికి జిల్లా రైతాంగం తీరని నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి చేలను తుపాన్ తీవ్రంగా దెబ్బతీసింది. వరి కోత లు జరుగుతున్న సమయంలో రెండు రోజుల పాటు కురిసిన వర్షంతో చేలు నేల వాలడం, చేలపై ఉన్న వడ్లు రాలిపోవడంతో పాటు కోసిన అనంతరం అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం సైతం పెద్దమొత్తంలో తడిసి ముద్దయింది. దీంతో వరి పండించిన రైతులపై కోలుకోలేని దెబ్బ పడింది. ఇక పత్తి పంటకు భారీ నష్టం వాటిల్లింది.
జిల్లాలో మెజార్టీ ప్రాంతాల్లో పత్తి ఏరేందుకు సిద్ధంగా ఉండగా తుపాన్ ధాటికి పత్తి తడిసి రంగుమారే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఏరిన పత్తిని కొనే దిక్కులేకపోవడంతో ఇండ్లల్లోనే తేమతో బూజుపట్టి నల్లబారే ప్రమాదం పొంచి ఉంది. మొత్తంగా నల్లగొండ జిల్లాలో కనీసం లక్ష ఎకరాల్లో వరి, పత్తి పంటలకు మొంథా తుపాన్ వల్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగి పంట నష్టం అంచనాలపై దృష్టి సారించింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు గురువారం నాటికి పంటనష్టంపై ప్రాథమిక అంచనా రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు.
రహదారులు, తదితరాల నష్టంపై త్వరలో..
తుపాన్ ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల రహదారులు కోతకు గురికావడం, చెర్వులు, కుంటలకు గండ్లు పడ డం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని మండలాల్లో 10 సెం.మీటర్లకు పైగా భారీ వర్షం కురవడంతో ఎక్కువ నష్టం వాటిల్లింది. ఇక్కడ చాలా చోట్ల రహదారులపై వరద నీరు వచ్చి చేరడంతో కోతకు గురయ్యాయి. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ అధికారులు రోడ్ల నష్టం అంచనాలు రూపొందిస్తునట్లు తెలిసింది. వర్షాలకు 30 పశువులు మృత్యువాత పడగా వరదల్లో చిక్కుకున్న 143 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 58 కుటుంబాలను కూడా రెస్క్యూ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు.

ధాన్యం రైతుల అవస్థలు..
రెండు రోజుల తుపాన్ ఎఫెక్ట్‌తో జిల్లాలో చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ఇప్పటికే గత పక్షం రోజులుగా కొనుగోలు కేం ద్రాలకు తెచ్చిన ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడంతో ఎక్కువ నష్టం వాటిల్లింది. రైతులు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టి నిబంధనల ప్రకారం తేమశాతం ఉన్నా నిర్వాహకులు ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో ఆరిన ధాన్యం సైతం తిరిగి తడిసింది. దీంతో రైతులు తిరిగి ఆరబెడితే తప్ప ధాన్యం కొనే పరిస్థితి లేదు. గురువారం జిల్లాలో వర్షం తెరిపినివ్వడంతో రైతులు కేంద్రాల్లోని ధాన్యాన్ని ఆరబెట్టడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దగ్గరలోని రహదారులు, పల్లపు ప్రదేశాల వెంట ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు శ్రమించారు. చాలా చోట్ల రోడ్ల వెంట వేలాది మంది రైతులు ధాన్యం ఆరబోస్తూ కనిపించారు.
అధికారుల లెక్కల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యం 3 వేల మెట్రిక్ టన్నులు, కొనేందుకు సిద్ధంగా ఉన్న 2వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసింది. ఇలా తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ బియ్యంగా మార్చేందుకు కొనుగోలు చేయనున్నట్లు అధికారుల ప్రకటించారు. ఇక పత్తి రైతులను ఈ సీజన్ అంతా దురదృష్టమే వెంటాడుతోంది. అతివృష్టితో పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదే సమయం లో అంతంత మాత్రంగా చేతికొచ్చిన పత్తికి సైతం మా ర్కెట్లో ధర లేదు. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేం ద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం చేయడంతో దళారులు చెప్పిందే వేదంగా మారింది. దీంతో పత్తి రైతులకు కనీసం పెట్టుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదు.
ఎక్కువగా వరి, పత్తి పంటలే…
తుపాన్ ప్రభావంతో మొత్తం 61,511 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాలు రూపొందించారు. ఇందులో ఎక్కువగా వరి, పత్తి పంటలే ఉన్నాయి. జిల్లాలోని 310 గ్రామాల్లో తుపాను ఎఫెక్ట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో మొత్తం 30,359 మంది రైతులు పంటనష్టం బాధితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఎక్కువ నష్టం జరిగింది. వరి పంటకు సంబంధించి మొత్తం 35,487 ఎకరాల్లో, పత్తి 25,919 ఎకరాల్లో , మిర్చి 105 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వరి 14,004, పత్తి 2814 ఎకరాల్లో, దేవరకొండ నియోజకవర్గంలో 4665 ఎకరాల్లో వరి, 18,830 ఎకరాల్లో పత్తి , మిర్యాలగూడ నియోజకవర్గంలో 10,244 ఎకరాల్లో వరి, 65 ఎకరాల్లో పత్తి , మునుగోడులో 925 ఎకరాల్లో వరి, 1350 పత్తి, నకిరేకల్ నియోజకవర్గంలో 4410 ఎకరాల్లో వరి, పత్తి 2721 ఎకరాల్లో, నల్లగొండ నియోజకవర్గంలో 1239 ఎకరాల్లో వరి, 139 ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటినట్లు అధికారులు నిర్ధారించారు.
మొంథా నష్టం రూ.303 కోట్లపైనే!

సూర్యాపేట, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రైతులను మొంథా తుపాన్ తీవ్రంగా దెబ్బతీసింది. రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి నీట మునిగిన వరి, పత్తి పంటల విలువ సుమారు రూ.303 కోట్ల పైనే ఉంటుంది. 54 వేల ఎకరాల్లో వరి పంట నీటి పాలు కాగా 10 వేల ఎకరాల్లో పత్తి మునిగింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. తుపాన్ తమను కోలుకోలేని దెబ్బ తీసిందని, ప్రభు త్వం తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్‌తో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రోజం తా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అత్యధిక మండలాల్లో 6 నుంచి 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పంట పొలాల్లో నీరు నిలిచింది. మరో వారం రోజుల్లో పంట చేతికి రాను న్న సమయంలో కురిసిన భారీ వర్షంతో జిల్లాలో 54,006 ఎకరాల్లోని పంట మొత్తం నీటి పాలైంది. వరి ఎకరాకు 21 క్వింటాళ్లు వస్తుండగా ఎకరా ఒక్కంటికి దాదాపు రూ.45 వేలు ఉంటుంది.
ఈ లెక్కన జిల్లాలో మునకకు గురైన వరి పంట విలువ ఎంఎస్పీ ప్రకారం 243.03 కోట్లు ఉంటుంది. జిల్లాలో 10,933 ఎకరాల్లో పత్తిపంట నీట మునగడంతో, ఎకరా ఒక్కంటికి రూ.55,000 మేర నష్టం ఉంటుంది. ఈలెక్కన నీట మునిగిన పత్తిపంట విలు వ 60.13 కోట్ల పైనే ఉంటుంది. మొత్తం నష్టపోయిన వరి, పత్తి పంటల విలువ 303.13 కోట్లు ఉం టుందనేది అంచనా. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తుపాను కారణంగా నీటి పాలైందని, తమను ప్రభుత్వం ఆదుకోకుంటే అప్పుల ఊబినుంచి బయట పడడం కష్టమని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతులను నిండా ముంచిన మొంథా

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : మొంథా తుపాను రైతుల పాలిట శాపంగా మారింది. చేతికొచ్చే సమయానికి వర్ష బీభత్సంతో పంటలు దెబ్బతిన్నాయి. వరి పంట నీట మునగగా, పత్తి చేలల్లోకి నీరు చేరి తడిసి ముద్దయ్యింది. జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అడ్డగూడూరు మండలంలో 18 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో వర్ష నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లాలోని 54 గ్రామాల్లోని 430 మంది రైతులకు చెందిన 706.3 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. (33 శాతానికి పైగా జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నారు.) ఇందులో అధిక శాతం వరి పాడైపోయింది.
అత్యధికంగా అడ్డగూడూరు మండలంలోని 216 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. బొమ్మల రామారం మండలంలోని 12 గ్రామాల్లో 151 ఎకరాలు, మోత్కూరులో 110 ఎకరాలు, రామన్నపేటలో 54 ఎకరాలు, చౌటుప్పల్‌లో 50 ఎకరాలతోపాటు పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. పలు చోట్ల 14 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాగా పంట నష్టంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో ఎకరాకు 10వేల నష్టం ప్రకటించారని, అదే వర్తించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
 
                            